వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం : మంత్రి

11 Dec, 2019 10:26 IST|Sakshi

ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ శాసనసభ మూడోరోజు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ సమాధానమిచ్చారు. కర్నూలు జిల్లాలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌తో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాటసాని కోరగా.. కర్నులు జిల్లాలోని శకునాల గ్రామంలో సోలార్‌ పార్క్‌ కోసం భూసేకరణ పూర్తయిందని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని చెప్పారు. క్లీనింగ్‌కు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. త్వరలో ఈ విషయంపై చర్చించి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు.

మంత్రుల కమిటీని నియమించాం..
ఎయిడెడ్‌ కాలేజీల్లోపనిచేసే అధ్యాపకుల జీతాలు పెంచాలని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను అన్నారు. వారికి కనీసం రూ.20 వేల జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేసే విషయమై ముఖ్యమంత్రి మంత్రుల కమిటీని నియమించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. స్టూడెంట్స్‌, టీచర్స్‌ నిష్పత్తి కారణంగా నాణ్యతా ప్రమాణాలు తగ్గుతున్నాయని అన్నారు. త్వరలోనే వీటన్నింటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరుస్తామని మంత్రి చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు