ఐయామ్‌ సారీ..!

22 Jan, 2020 04:50 IST|Sakshi

విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్‌ తీవ్ర మనస్తాపం.. 

సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన తమ్మినేని

సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై సభాపతి తమ్మినేని సీతారాం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎంత సహనం పాటించినా దారికి రాని విపక్షం తీరుతో విసిగిపోయిన ఆయన సభా స్థానం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. మంగళవారం అసెంబ్లీ కొలువుదీరాక.. తొలుత మాజీ ఎమ్మెల్యే కోటా రామారావు మృతికి  సంతాపం ప్రకటించింది. అనంతరం స్పీకర్‌ తమ్మినేని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై చర్చకు అనుమతించారు. ఈ దశలో టీడీపీ సభ్యులు మూకుమ్మడిగా స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అదే అమరావతి’ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని సభా కార్యక్రమాలకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ‘మాట్లాడే అవకాశం ఇస్తాను. సీట్లలో కూర్చోండి’ అని సభాపతి పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా వినిపించుకోని ప్రతిపక్ష సభ్యులు ‘సేవ్‌ అమరావతి’ అంటూ అధికార పక్ష సభ్యులు మాట్లాడేది వినిపించకుండా నినాదాలు చేశారు. దాదాపు గంటన్నర పాటు ఇదేవిధంగా వ్యవహరించారు.

కొంతమంది విపక్ష సభ్యులు ఏకంగా కాగితాలు చింపి స్పీకర్‌ పోడియం వద్ద విసిరేస్తూ, సభాపతి పట్ల అనుచితంగా మాట్లాడటం కన్పించింది. ఒక దశలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ తీరుపై తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గంటన్నర తర్వాత కూడా విపక్ష సభ్యులు మాట వినకపోవడంతో స్పీకర్‌ ఆగ్రహానికి గురయ్యారు. అప్పటికీ దారికి రాకపోవడంతో విసిగిపోయిన ఆయన తీవ్ర భావోద్వేగంతో ‘ప్లీజ్‌.. ఐ యామ్‌ సారీ.. ఐ యామ్‌ ప్రొటెస్టింగ్‌ ది ఆటిట్యూడ్‌ ఆఫ్‌ టీడీపీ ఎమ్మెల్యేస్‌.. నిజంగా మనస్తాపానికి గురవుతున్నా’ అంటూ సభా స్థానం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభ అర్ధంతరంగా వాయిదా పడింది. 

మరిన్ని వార్తలు