‘ఏపీ సీఎంను డిసైడ్‌ చేసేది బీజేపీనే’ 

15 May, 2018 19:49 IST|Sakshi

ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్‌ రాజు 

సాక్షి, విశాఖపట్నం : కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గెలుపును అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టారని ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్‌ రాజు వ్యాఖ్యానించారు. కన్నడ ప్రజాతీర్పుపై ఆయన స్పందిస్తూ.. బీజేపీకి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన తెలుగువారికి, కన్నడిగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాక్షాత్తు ఎన్జీవో సంఘంతో తమ పార్టీకి ఓటేయద్దని టీడీపీ ప్రచారం చేయించినా మోదీ నాయకత్వంలోని బీజేపీకి బ్రహ్మరథం పట్టారని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే 2019 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పే కల్లబొల్లి మాటలు ప్రజలు వినరని స్పష్టమైందని, సీఎంను ఎన్నుకునే ప్రక్రియలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని విష్ణు కుమార్‌రాజు జోస్యం చెప్పారు.   

టీడీపీ నీచ రాజకీయాలకు చరమగీతం
టీడీపీ నీచ, నికృష్ట రాజకీయాలకు కన్నడ తెలుగువారు చరమగీతం పాడారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయించాలనుకున్న టీడీపీ తమ్ముళ్ల​ పప్పులు ఉడకలేదని ఆరోపించారు. కర్ణాటక ప్రజలు తీర్పు ఏకపక్షంగా బీజేపీ వైపు ఉందని మాధవ్‌ తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు విభజన రాజకీయాలు మానుకుని, నిర్మాణాత్మక ధోరణిలో వెళ్లాలని సూచించారు. కన్నడనాట విజయం బీజేపీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని నింపిందని వివరించారు.   

మరిన్ని వార్తలు