‘అక్కడ మొక్కితే.. ప్రధానికి మొక్కినట్టే’

3 Apr, 2018 13:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవని వ్యాఖ్యానించారు.

‘నేను సభలో మాట్లాడటం కోసం ప్రయత్నిస్తున్నా.. నన్ను పట్టించుకోవడం లేదు. పరిణామాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సమైక్యాంధ్ర ఉద్యమసమయంలో గ్రామాల్లోకి వెళ్లలేకపోయేవాళ్లం.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత టీడీపీ చేస్తోన్న వాదనను ప్రజలు నమ్మడం లేదు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోంది కాబట్టే పైనుంచి నిధులు కట్ చేసి ఉంటారనే భావనలో ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కన్పిస్తోంది. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయం. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని బృందాలను కర్ణాటకకు పంపింద’ని మాణిక్యాలరావు తెలిపారు.

మరో బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే.. పార్లమెంటులో అత్యున్నత స్థానంలో కూర్చొన్న ప్రధానమంత్రికి మొక్కినట్టే అన్నారు. రాఫెల్ డీల్ వంటి విషయాల గురించి మాట్లాడేంత పెద్ద వాళ్లం కాదని.. శాండ్, ల్యాండ్ గురించి మాట్లాడతామని అన్నారు.

మరిన్ని వార్తలు