అది చంద్రబాబుకే నష్టం: సోము వీర్రాజు

23 May, 2018 12:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చట్టం తమ చేతుల్లో ఉందనే వైఖరిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. అలిపిరి దాడి ఘటన చంద్రబాబు కుట్రేనని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. దాడులకు పాల్పడితే చంద్రబాబుకే నష్టమన్నారు. తమ డిమాండ్లపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

కాగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై దాడి తర్వాత, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టడంపై వారు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.  అమిత్‌ షా పర్యటన అనంతరం జరిగిన సంఘటనలపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. గవర్నర్‌ను కలిసినవారిలో బీజేపీ ఎమ‍్మెల్సీ సోము వీర్రాజు, మాజీమంత్రి, ఎమ్మెల్యే మాణిక్యాలరావు, దినేష్‌ రెడ్డి ఉన్నారు.

ఉద్దేశపూర్వకంగానే అమిత్‌ షా పై దాడి
గవర్నర్‌తో భేటీ అనంతరం మాణిక్యాలరావు మాట్లాడుతూ... ‘ఉద్దేశపూర్వకంగానే అమిత్‌ షా మీద దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. అమిత్‌ షా కు రక్షణగా ఉన్న మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని ...తమ అధికారంతో తుంగలోకి తొక్కుతున్నారు. చంద్రబాబు దుశ్చర్యను తిప్పికొడతాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని బీజేపీతో లింక్‌ పెడుతున్నారు. టీటీడీలో అక్రమాలు జరిగాయంటే... అది పట్టించుకోకుండా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. టీటీడీలో అక్రమాలపై దర్యాప్తు చేయకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. విచారణ పారదర్శకంగా జరిపించాలి.’ అని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు