ఎన్డీయేలో ఉంటూనే కేంద్రంపై విమర్శలా?

12 Mar, 2018 01:13 IST|Sakshi

టీడీపీ వైఖరిపై బీజేపీ రాష్ట్ర శాఖ ఆగ్రహం 

సాక్షి, అమరావతి: ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతామని చెబుతూనే కేంద్ర ప్రభుత్వంపై విమర్శల పర్వం కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీపై బీజేపీ రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ ముఖ్యమంత్రి, మంత్రులు సహా టీడీపీ నేతలు పదేపదే ప్రకటనలు చేస్తుండడం పట్ల మండిపడ్డారు. టీడీపీ వైఖరిపై కొంతకాలం వేసిచూసి, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. ఒకవైపు టీడీపీ తీరును గమనిస్తూనే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందజేస్తున్న సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ నిర్ణయించింది.

కేంద్రంలో టీడీపీ మంత్రులు, రాష్ట్రంలో బీజేపీ మంత్రుల రాజీనామా తదనంతర పరిణామాలపై చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ ఆదివారం సమావేశమైంది. పార్టీ కేంద్ర పరిశీలకుడు సతీష్‌జీ నేతృత్వంలో విజయవాడలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా, టీడీపీ నేత, సినీ నటి కవిత ఆదివారం బీజేపీలో చేరారు. విభజన చట్టంలోని 85 హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలోనే నెరవేర్చిందని హరిబాబు చెప్పారు. ఇంత చేసినా రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదంటూ మిత్రపక్షం టీడీపీతో సహా పలు పార్టీలు విమర్శిస్తున్నాయని తప్పుపట్టారు. కోర్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.   

విజయవాడలో బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ భేటీలో పాల్గొన్న నేతలు 

మరిన్ని వార్తలు