‘కాపు రిజర్వేషన్లకు బాబు వ్యతిరేకి’

30 Jul, 2018 16:04 IST|Sakshi

బీసీలను రెచ్చగొట్టి కాపులపై దాడులు చేయించిన ఘనత బాబుదే

దమ్ముంటే బాబు నాతో చర్చకు రావాలి

రిజర్వేషన్ల అంశం కేంద్రంపై వేసి చేతులు దులుపుకోవాలనుకున్నారు: కన్నా 

సాక్షి, విజయవాడ: కాపు రిజర్వేషన్లపై మాట తప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అరోపించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం మాట తప్పారని మండిపడ్డారు. బీసీ నాయకులను చంద్రబాబు రెచ్చగొట్టి కాపులపై దాడుల చేయించారని ధ్వజమెత్తారు. కేవలం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారన్నారు.

గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తే బాబు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఉద్యమం చేసిన కాపులను, ముద్రగడ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. తుని ఘటనలో కాపులపై టీడీపీ ప్రభుత్వం అనేక తప్పుడు కేసుల పెట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రిజర్వేషన్‌పై చంద్రబాబు నాలుగున్నర ఏళ్లుగా కాలయాపన చేశారన్నారు.  బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ప్రయత్నిస్తోందని కన్నా తెలిపారు. రిజర్వేషన్‌ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రానికి పంపి బాబు చేతుల దులుపుకోవాలనుకున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబుకు సిగ్గుందా?
కడప స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే జోన్‌ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని టీడీపీ వర్గానికి చెందిన ఓ మీడియా రాయడం సరైనది కాదని కన్నా లక్ష్మీనారయణ పేర్కొన్నారు. రైల్వే జోన్‌ ఇస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు ఒంగోలు వెళ్లి ధర్మ పోరాట దీక్ష పెట్టడానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవం అవినీతి చేయడానికే ఉపయోగిస్తున్నారని విమర్శించారు.

హోదాపై అనేక సార్లు మాట మార్చిన బాబుకు పరిపక్వత లేదని ఎద్దేవ చేశారు. రాష్ట్ర అభివృద్దిపై చర్చ చేయడానికి మోడీ అవసరం లేదని.. చంద్రబాబు స్థాయికి తాను సరిపోతానని కన్నా పేర్కొన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాలు విసిరారు. హిందుత్వంపై చంద్రబాబు దాడికి దిగుతున్నారని అందుకే శివస్వామిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారిన మండిపడ్డారు. 
 

మరిన్ని వార్తలు