టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

16 Jul, 2019 14:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో టీడీపీ నేతల వైఖరిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. బడ్జెట్‌ అంశాలను పూర్తిగా చదివిన తర్వాత స్పందిస్తే బాగుంటుందని చురకలంటించారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే దాదాపు 80 శాతం హామీలను అమలు చేశామని సభ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోనే బడ్జెట్‌లో పొందుపరిచామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ మేనిఫెస్టో చూద్దామంటే ఎక్కడా కనిపించదని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోను టీడీపీ నేతలు టిష్యూ పేపర్‌లా భావించారని విమర్శించారు.

సభలో అంబటి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అవినీతి ప్రక్షాళన చేపట్టారు. ఇసుక, మట్టి దోపిడీ ఎక్కడా జరగడం లేదు. మా పార్టీ ఉన్నంతవరకు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. టీడీపీలా మాది కులపిచ్చి పార్టీ కాదు. వెనుకబడిన కూలాలకు బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయించాం. నాయిబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ప్రయోజనం కలిగించేలా కేటాయింపులు చేశాం. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాం. మైనార్టీల సంక్షేమానికి రూ.2000 కోట్లు కేటాయించాం. ఇమామ్‌లు, పాస్టర్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాం. దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామని ప్రకటించాం. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్న మూడోరోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులను తొలగించారు. ఎక్కడైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్‌ మద్యపాన నిషేదం అమలు చేస్తే..  తర్వాత వచ్చిన చంద్రబాబు ఆ నిషేధాన్ని తొలగించారు’అని అన్నారు.

మరిన్ని వార్తలు