‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు ఈసీకి సంబంధం లేదు’

25 Mar, 2019 19:03 IST|Sakshi
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది(పాత చిత్రం)

అమరావతి: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అమరావతిలో ద్వివేది విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం, న్యాయనిపుణుల అభిప్రాయం తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ఈ నెల 29న సినిమా విడుదల చేసే అంశం ఈసీకి సంబంధం లేదని వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓటర్ల తుది జాబితాను ఖరారు చేశామని తెలిపారు. ఫారం-6లను మార్చి 10వ తేదీన నిలిపేసినా..పరిశీలన ప్రక్రియను ఇవాళ్టి వరకూ కొనసాగించామన్నారు.

మార్చి 20వ తేదీనే ఓట్ల తొలగింపు పక్రియ ముగిసిందన్నారు. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 3 కోట్ల 93 లక్షల 12 వేల 192 మందిగా తేలిందని, మార్చి 18వ తేదీతో మొదలైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసిందని చెప్పారు. అలాగే మార్చి 26వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో కేంద్రం నుంచి వచ్చిన అబ్జర్వర్లు కూడా పాల్గొంటారని, వీడియో రికార్డింగు కూడా చేయనున్నామని వెల్లడించారు.

రాజకీయ పార్టీలు తుదిగా అభ్యర్థులకు జారీ చేసిన బీఫాంనే ఈసీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ రూ.55 కోట్ల నగదు, 91 కేజీల బంగారం, 230 కేజీల వెండి, 120 వాహనాలు స్వాధీనం అయ్యాయని వెల్లడించారు. అలాగే 12 కోట్ల రూపాయల విలువ చేసే 2.5 లక్షల లీటర్ల మధ్యం దొరికిందని, రూ.6 కోట్ల విలువ చేసే ఎన్నికల్లో పంచే వస్తువులు పట్టుకున్నట్లు చెప్పారు. సోషల్‌ మీడియాలో దురుద్దేశపూర్వక వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలకు 367 నోటీసులు జారీ చేసినట్లు ద్వివేది తెలిపారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు