ఆ వీడియోలు చంద్రగిరివి కాదు

18 May, 2019 16:27 IST|Sakshi

రీపోలింగ్‌పై హైకోర్టుకు కౌంటర్‌..

ఒరిజినల్‌ వీడియోలు కూడా సమర్పించాం

చంద్రగిరి రీపోలింగ్‌పై గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, అమరావతి : సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వీడియో ఫుటేజీలు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానివి కాదని ఏపీ  ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీపోలింగ్‌పై  దాఖలైన పిటిషన్‌ విషయమై కోర్టులో ఎన్నికల సంఘం (ఈసీ) కౌంటర్‌ దాఖలు చేసిందని, కౌంటర్‌తోపాటు వీడియో ఫుటేజీలు అందించామని ఆయన శనివారం వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరిగే ఏడుచోట్ల వీడియో ఆధారాలు లభించాయని, అందువల్లే ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 23వతేదీలోపు ఎప్పుడైనా రీపోలింగ్‌ చేయొచ్చన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీపోలింగ్‌ సంబంధించిన లేఖను ఈసీకి పంపడంలో తప్పేమీ లేదని తెలిపారు. వీవీప్యాట్లలో మాక్‌ పోలింగ్‌ స్లిప్పులు తొలగించకుండా ఉంటే.. వాటిని లాటరీ నుంచి మినహాయిస్తామని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్ల జారీలో ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. మడకశిరలో రెండు ఓట్లు జారీ చేస్తే ఒక ఓటును వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఆకాశ రామన్న ఫిర్యాదులపై స్పందించొద్దని ఈసీ మార్గదర్శకాల్లో ఉందని, ఎవరైనా నేరుగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే స్పందించాలని ఉందని తెలిపారు. కౌంటింగ్ రోజున ఫలితాలు వెల్లడించాల్సిన బాధ్యత ఆర్వో, అబ్జర్వర్లదేనని, సీఈసీ అనుమతించిన తర్వాతే  ఆర్వోలు ఫలితాలను ప్రకటించాలని చెప్పారు. కౌంటింగ్‌కు సంబంధించిన నిర్ణయాధికారాలు ఆర్వో, అబ్జర్వర్లదేనని, రాష్ట్రంలో 200 మంది ఆర్వోలు, 200మంది అబ్జర్వర్లు కౌంటింగ్ విధుల్లో ఉంటారని తెలిపారు. రీపోలింగ్‌కు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తి చేశామని, ఏడు చోట్ల 1800 మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎండల దృష్ట్యా రీపోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు