గోబెల్సే సిగ్గుపడేలా!

4 Jan, 2019 01:59 IST|Sakshi

రోజుకో రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాద రాజకీయ క్రీడ

పొత్తులేకుండా బాబు గట్టెక్కిన ఎన్నిక ఉందా?

నిన్నటిదాకా బీజేపీతో కలిసేందుకు కాంగ్రెస్‌పై విమర్శలు

ఇప్పుడు కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు కమలంపై బురద

అప్పుడు, ఇప్పుడూ వైఎస్సార్‌సీపీపై నిందలు మోపే కుయుక్తి

పదేళ్లుగా వైఎస్‌ జగన్‌ది ఒంటరి పోరే... పొత్తు మాటే లేదు

అయినా ఆగని బాబు అసత్య ప్రచారం

తనకు అనుకూల ఎల్లో మీడియాలో దుష్ప్రచారం

టీఆర్‌ఎస్‌ తోక పట్టుకోవాలనుకుందీ బాబే

కుదరక కాంగ్రెస్‌ పంచన చేరిందీ ఆయనే

సాక్షి, అమరావతి: చంద్రబాబు తన రాజకీయ జీవితంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, జనసేన... ఇలా అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారు. ఎత్తుగడలో భాగంగా వాటితో తెగదెంపులూ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన చాలా తెలివిగా డ్రామాలాడేవారు. తాను అన్నేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్న పార్టీతో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తోందంటూ విపక్షంపై బురదజల్లడం ఆయన వ్యూహం. ఎల్లో మీడియా దీన్ని అందమైన అసత్య కథనాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలే గీటురాయిగా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ పదేళ్లుగా ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. భవిష్యత్తులోనూ ఆ ఆలోచనే లేదని విస్పష్టంగా చెప్పినా చంద్రబాబు తన పొత్తుల మ్యాజిక్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీపై నిత్యం బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌తోనూ, బీజేపీతో కాపురం చేసిన వ్యక్తి చంద్రబాబే. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండాఎవరితోనూ కలసి పనిచేయకుండా ఒంటరిగా బరిలోకి దిగి పోటీ చేసింది వైఎస్సార్‌ సీపీనే. అయితే  వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్‌ ఒకటేనంటూ ఓసారి... వైఎస్సార్‌ సీపీ, బీజేపీ ఒకటేనని మరోసారి చంద్రబాబు, ఎల్లో మీడియా గోబెల్స్‌ ప్రచారం చేయడంలో ముందున్నారు. 

బీజేపీతో అంటకాగేందుకు...
గోద్రా అల్లర్లప్పుడు మోదీని విలన్‌గా పేర్కొన్నదీ చంద్రబాబే. నాడు రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వబోనని శపథం చేసిందీ ఆయనే. బీజేపీని మతతత్వపార్టీ అంటూ దుమ్మెత్తి పోసిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో ప్లేటు ఫిరాయించారు. ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని నరేంద్రమోదీని ఆకాశానికెత్తారు. బీజేపీ ఏలుబడిలోనే దేశ భవిష్యత్‌ బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్, వైఎస్సార్‌ సీపీలను ఒకేగాటన కట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌ సీపీని పిల్ల కాంగ్రెస్‌ అంటూ నిందించారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే రాహుల్‌గాంధీకి ఓటేసినట్టేనన్నారు. ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని దుష్ప్రచారం చేశారు.

కాంగ్రెస్, టీడీపీ కలిసికట్టుగా బనాయించిన అక్రమ కేసుల్లో వైఎస్‌ జగన్‌కు చట్టబద్ధంగా బెయిల్‌ లభిస్తే.. చంద్రబాబు దాన్నీ రాజకీయం చేశారు. కాంగ్రెస్‌ వల్లే బెయిల్‌ వచ్చిందంటూ ఆరోపించారు. రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని తప్పుడు ప్రచారం చేశారు. సోనియా, రాహుల్‌పై చంద్రబాబు చేయని విమర్శ లేదు. సోనియాను గాడ్సేగా పేర్కొంటూ ఆమెది కక్కుర్తి రాజకీయమని, అవినీతి అనకొండగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీని ఆయన పప్పు అని వ్యాఖ్యానించిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ బీజేపీకి దగ్గరవ్వడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలే. అనుకున్నట్టే బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన చంద్రబాబు అనేక స్వప్రయోజనాలు సాధించుకున్నారు. మంత్రివర్గాల్లో పదవులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి ఒక్కొక్కటీ బయటకొస్తోంది. చేసిన హామీలు నెరవేర్చని బాబును ఊరూరా వెంటాడే పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల దౌర్జన్యాలు, అక్రమాలపై ప్రజలు నిరసన గళం విప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ముందున్న వైఎస్సార్‌ సీపీ ప్రజల్లో చైతన్యం రగల్చటాన్ని గుర్తించిన చంద్రబాబు బెంబేలెత్తి కేంద్రంపై నెపం మోపే యత్నాలకు దిగారు. కేంద్రం నిధులివ్వడం లేదని, రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదంటూ డ్రామాలో మరో అంకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బీజేపీతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మోదీపై మాటల యుద్ధం మొదలు పెట్టారు. ఇది అంతటితో ఆగలేదు. బీజేపీతో పొత్తు కోసం వైఎస్సార్‌ సీపీ సిద్ధమవుతోందంటూ బురద జల్లారు. 

కాంగ్రెస్‌తో కొత్త కాపురం..
కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ టీడీపీ అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ కార్యకర్తలే ఊహించలేదు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కొత్త పొత్తులతో ముందుకెళ్లారు. రాహుల్‌తో కలిసి అడుగులేశారు. నాలుగేళ్ల క్రితం దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్‌ను ఆకాశానికెత్తారు. అప్పటిదాకా అంటకాగిన బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. సోనియాను దేవతగా వర్ణిస్తూ రాహుల్‌ను మేధావిగా ప్రశంసించారు. చారిత్రక అవసరాల కోసమే ఈ పొత్తంటూ కితాబిచ్చుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమే కాంగ్రెస్‌తో కలిసినట్టు ప్రకటించారు. ఆ పార్టీతో కలిసి మోదీపై పోరాడతానన్నారు. విలువలు లేని రాజకీయాలు చేస్తూ తనను తాను సమర్థించుకున్నారు. 

అవకాశవాదానికి పరాకాష్ట
చంద్రబాబు ఇప్పుడు కొత్తగా తెరపైకి ప్రచారం ఏమిటంటే కాంగ్రెస్‌తో కలవని వారంతా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టే లెక్కంటున్నారు. రాష్ట్రాలను పెద్ద మున్సిపాలిటీల మాదిరిగా కేంద్రం దిగజారుస్తున్న నేపథ్యంలో ఒక స్పష్టమైన ఫెడరల్‌ వ్యవస్థ కోసం ఉద్యమించడం ప్రస్తుతం అవసరం. కానీ చంద్రబాబు వింత వాదనకు బుద్ధి జీవులే ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం అధికారాలను విస్తరించడంలో దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీకి, ఫెడరల్‌ నినాదంతో ఎలా మైత్రీ బంధమో బాబుకే తెలియాలి. రాజకీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడాలన్నా, పొత్తులు పెట్టుకోవాలన్నా భావజాల సారూప్యత అవసరం. ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి ఉండాలి. దీనికి భిన్నంగా అవకాశవాదంతో ఎవరినైనా  కౌగిలించుకునేందుకు వెనుకాడని చంద్రబాబు లాంటి రాజకీయ వేత్తలు విదేశాల్లో కాగడా పెట్టి వెతికినా కానరారు. 

టీఆర్‌ఎస్‌తో చెలిమికి తహతహ
ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లిందీ చంద్రబాబే. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయన ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం విశేషం. ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? చంద్రబాబును దర్యాప్తు సంస్థలు కనీసం ఒక్కసారైనా ఎందుకు ప్రశ్నించలేదు? దీన్నిబట్టి టీఆర్‌ఎస్‌ – టీడీపీ మైత్రి  బంధం ఎంతబలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా కేసీఆర్‌తో దోస్తీ కోసం చంద్రబాబు తహతహలాడారని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

సొంత బావమరిది హరికృష్ణ మృతదేహం సాక్షిగా ఎన్నికల పొత్తుపై చంద్రబాబు చర్చించిన విషయాన్ని టీడీపీ వర్గాలే ధృవీకరించాయి. ఆ పార్టీ నిరాకరించడం వల్లే కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేయాల్సి వచ్చిందని టీడీపీ నేతలే చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌తో ఇంత సన్నిహిత సంబంధాలున్న చంద్రబాబు వైఎస్‌ జగన్‌పై బురదజల్లే వ్యూహానికి పదునుపెట్టారు. టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్‌ సీపీ సంబంధాలు పెట్టుకుందని దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్‌ సీపీ 2014లోగానీ ఇప్పుడుగానీ ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా, ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా తమది ఒంటరి పోరేనని స్పష్టంగా ప్రకటించింది. అయినాసరే చంద్రబాబు అప్పుడు కాంగ్రెస్‌తో, ఇప్పుడు బీజేపీతో అంటగడుతూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దీన్ని అమాయకంగా నమ్ముతారని భ్రమ పడుతున్నారు. 

జర్మనీ నియంత హిట్లర్‌ దగ్గర గోబెల్స్‌ అనే ప్రచారశాఖ మంత్రి ఉండేవాడు. హిట్లర్‌ ప్రయోజనాలకు అనుగుణంగా అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ఆయన ప్రచారం చేసేవాడు. ఒక అబద్ధాన్ని పదేపదే నిజమని చెబితే అది నిజంగానే నిజమై పోతుందనేది ఆయన ఫిలాసఫీ. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా, వందిమాగధులు గోబెల్స్‌ తత్వశాస్త్రంలో కొత్త పుంతలు తొక్కుతున్న తీరును గోబెల్స్‌ కూడా ఊహించి ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. మోదీ, కేసీఆర్, జగన్‌ కలిసి ఒక అవగాహనతో పనిచేస్తున్నారని చంద్రబాబు తాజాగా ఆరోపిస్తున్నారు. 2014 ఎన్నికలప్పుడు ఆయన సరిగ్గా దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం గమనార్హం. నాడు కాంగ్రెస్, జగన్‌ ఒక్కటే అంటూ బాబు ఆరోపణలకు దిగారు. బీజేపీ, టీడీపీ కలిసి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాయన్నారు.

2014 ఎన్నికలప్పుడు..
వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే రాహుల్‌కు ఓటేసినట్లే. ఎన్నికలయ్యాక జగన్‌ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాడు. కాంగ్రెస్‌ తల్లి కాంగ్రెస్‌ అయితే పిల్ల కాంగ్రెస్‌ వైఎస్సార్‌సీపీ

2018 ఏప్రిల్‌ తర్వాత..
నా తర్వాతే నరేంద్ర మోదీ. ఆయన హయాంలో ఒరిగిందేమీ లేదు. వ్యవస్థలను మోదీ నాశనం చేస్తున్నారు. ఇందిరాగాంధీ హయాంలోనూ ఈ పరిస్థితి లేదు

2018 ఏప్రిల్‌ వరకు..  మోదీ నేతృత్వంపై
ప్రజల్లో విశ్వాసం ఉంది. ఆర్థిక వ్యవస్థ బాగుపర్చడం ఆయనవల్లే సాధ్యం. 2019లోనూ ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తాం

తెలంగాణ ఎన్నికల సమయంలో..
 ప్రధాని నరేంద్ర మోదీఒక దొంగ... సోనియాదేవత, కాంగ్రెస్‌తోనే దేశానికి న్యాయం

బీజేపీపై పొగడ్తలు                            
మోదీ దేశానికి కావాలి. బీజేపీకే మద్దతు (2014)          
మోదీనే మళ్లీ మళ్లీ ప్రధాని... అది మా అకాంక్ష (21.5.2014)      
మోదీ నేతృత్వంపై ప్రజల్లో విశ్వాసం (11.4.2017)            
కేంద్రం ఏపీకి చేసిన సాయం మరే రాష్ట్రానికి చేయలేదు (2016)      
                                  
కాంగ్రెస్‌పై విమర్శలు
కేసీఆర్, జగన్‌ సోనియా బాణాలు (29.09.2013)
కాంగ్రెస్‌ది రక్తహస్తం 23.4.2014)
జగన్‌కు ఓటేస్తే రాహులే ప్రధాని.. సోనియా ఖబడ్దార్‌ (3.5.2014)
వైఎస్సార్‌ సీపీని కాంగ్రెస్‌లో కలిపేస్తారు. ఆ పార్టీ పిల్ల కాంగ్రెస్‌ (2014)
సోనియా అవినీతి అనకొండ.. రాహుల్‌ బావమరిదికి రూ.వేల కోట్లు ఎలా వచ్చాయి?
ఏ ముఖం పెట్టుకుని రాహుల్‌ రాష్ట్రానికొస్తాడు. కాంగ్రెస్‌ పనికిమాలిన పార్టీ (2016)

కాంగ్రెస్‌తో జత కట్టాక... కాంగ్రెస్‌పై పొగడ్తలు                      
కాంగ్రెస్‌తో పొత్తు చారిత్రక అవసరం (2018)            
కాంగ్రెస్‌తో కలయిక ప్రజాస్వామ్య పరిరక్షణకే(2018)        
కాంగ్రెస్‌ సహకారం తీసుకుంటాం              
భావి తరాల భవిష్యత్‌ కోసమే కాంగ్రెస్‌తో పొత్తు (2.11.18)  
                              
బీజేపీపై విమర్శలు
బీజేపీది నమ్మక ద్రోహం ( 30.09.2018)
అవినీతికి పీఎంవో దన్ను (25.11.18)
జగన్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే (29.8.18)
ఢిల్లీ తొత్తులు రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారు.
బీజేపీతో జగన్, పవన్‌ లాలూచీ (26.8.18)

పొంతనలేని ఈ వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య విమర్శలు కావు.ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు పరస్పరంచేసుకునే ఆరోపణలు అంతకన్నా కావు.ఈ పలుకులు ఒకే వ్యక్తివి.అవకాశవాద రాజకీయాలతో నిస్సిగ్గుగాఎవరినైనా ఆకాశానికెత్తొచ్చు, అదే వ్యక్తిపై దుమ్మెత్తి పోయవచ్చనే సూత్రం పాటించే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారొచ్చని ఆయన అనేకసార్లు రుజువు చేశారు. ఎవరితోవెళ్తే లాభమో చూసుకుని వారిని ఆకాశానికెత్తడం, ఈ క్రమంలో శత్రువర్గంతో కలుస్తోందంటూవైరి పక్షంపై పనిగట్టుకుని ప్రచారం చేయడంలో చంద్రబాబుకు పీహెచ్‌డీ ఇవ్వవచ్చని ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తుంటారు. 

మరిన్ని వార్తలు