చంద్రబాబుతో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ

13 May, 2019 11:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 14న జరుగుతుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మంగళవారం జరగనున్న కేబినెట్‌ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. కేబినెట్‌ సమావేశంపై సీఈసీ నుంచి అనుమతి రాలేదని సీఎంకు సీఎస్‌ చెప్పారు. ఈ రోజు అనుమతి రాకపోతే రేపు మధ్యాహ్నం అధికారులతో సమీక్ష నిర్వహించే ఆలోచనలో ముఖమంత్రి చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం అనుమతి కోసం ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాలని అధికారులకు సూచించారు. 

కేబినెట్ భేటీ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం అజెండాను సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి పంపగా ఆయన ఈ నెల 10న ఈసీకి నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ రోజు సాయంత్రానికల్లా సీఈసీ నుంచి అనుమతి వస్తేనే రేపు (మంగళవారం) కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు