చంద్రబాబు ప్రెస్‌మీట్‌ రద్దు

17 Jun, 2018 18:44 IST|Sakshi

న్యూఢిల్లీ: అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ హస్తినలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు ముఖం చాటేశారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.

సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు ప్రెస్‌మీట్‌ ఉంటుందని టీడీపీ వర్గాలు మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చాయి. అయితే నీతి ఆయోగ్‌ సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని మోదీతో నవ్వుతూ కరచాలనం చేసిన విషయంపై మీడియా ప్రతినిధులు నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు విలేకరుల సమావేశం రద్దు చేసుకున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ తీవ్ర అన్యాయం చేశారని, కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఇటీవల కాలంలో చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధానమంత్రిని చంద్రబాబు నిలదీస్తారని టీడీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. దీనికి భిన్నంగా చంద్రబాబు ముసిముసి నవ్వులతో వంగి వంగి ప్రధానితో కరచాలనం చేశారు. దీంతో చంద్రబాబుపై ప్రతిపక్షాలతో పాటు మీడియా ప్రముఖులు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

మోదీ-బాబు కరచాలనంపై ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా ట్విటర్‌లో స్పందిస్తూ.. ఇది కదా రాజకీయమంటే అని వ్యాఖ్యానించారు. మమత బెనర్జీ, కుమారస్వామి ఒక్కోసారి బీజేపీతో అధికారం పంచుకున్నారని.. చంద్రబాబు మాత్రం రెండుసార్లు కాషాయ పార్టీతో అధికారం పంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజనీతి అంటే ఇదే అంటూ మరో జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ట్విటర్‌లో సెటైర్‌ వేశారు.

మరిన్ని వార్తలు