సమన్యాయం చేయమన్నా..

9 Sep, 2018 01:50 IST|Sakshi
ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో చంద్రబాబు, రమణ తదితరులు

  టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య 

  తెలంగాణ ఏర్పాటును నేనెప్పుడూ వ్యతిరేకించలేదు 

  బీజేపీకి మద్దతిస్తే తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగదు 

  కేంద్రం ఏపీని మోసం చేసింది.. తెలంగాణకు ఏమీ చేయలేదు 

  పొత్తులపై ఇక్కడి నేతల నిర్ణయమే ఫైనల్‌..మీ నిర్ణయం చెబితే సహకరిస్తా.. 

  తెలంగాణలో తాను సీఎంగా ఉండలేనని స్పష్టీకరణ 

  ఎల్‌.రమణ అధ్యక్షతన టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరానే తప్ప తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలతో తనకు విడదీయరాని అవినాభావ సంబంధం 35 ఏళ్లుగా కొనసాగుతోందని, తాను రాష్ట్రాన్ని విభజిం చవద్దని కానీ, విభజించమని కానీ చెప్పలేదని  అన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఉండటం చారిత్రక అవసరమని, తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యేందుకు టీడీపీ కష్టపడిందని చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, సైబరాబాద్, అంతర్జాతీయ విమానాశ్రయం, జీనోమ్‌ వ్యాలీ, ట్రిపుల్‌ ఐటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి.. ఇలా అన్నీ టీడీపీ ప్రారంభించిన ప్రాజెక్టులేనని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టు ఏపీని అభివృద్ధి చేయాలని, మంచి రాజధానిని నిర్మించాలని కృషి చేస్తున్నామని చెప్పారు.  

కేంద్రం తెలంగాణకు ఏమీ చేయలేదు 
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిందని, అలాగని తెలంగాణకు ఏమీ చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. ‘‘తెలంగాణకు ఏమైనా ఇచ్చారా..? డబ్బులన్నీ హైదరాబాద్‌ నుంచే వెళ్తున్నాయి. దేశంలోనే ఎక్కువ పన్నులు కట్టే నగరం హైదరాబాద్‌. ఈ రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేసే బాధ్యత కేంద్రానికి లేదా? ఎందుకివ్వరు?’’అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయలేదని, కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టును కూడా ప్రకటించలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు తెలంగాణ కోసం విభజన చట్టంలో పెట్టిన అంశాల కోసం టీడీపీ పక్షాన తాను పోరాటం చేశానని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రో ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తున్నదన్నారు. 

పొత్తుపై మీ నిర్ణయమే ఫైనల్‌ 
పార్టీ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేస్తే బాగుంటుందో ఓ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ‘‘రేపు, ఎల్లుండి రాష్ట్ర నేతలు కూర్చుని ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తాను’’అని అన్నారు.  తెలంగాణలో పార్టీ నిలదొక్కుకుని బలోపేతం కావాల్సి ఉన్న నేపథ్యంలో అందరికీ అవకాశం ఇవ్వలేమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ ఉండాలని, ఆ అవసరాన్ని కాపాడేలా ఇక్కడి నేతలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘జై తెలంగాణ.. జై తెలంగాణ.. జై తెలంగాణ’అని ప్రసంగాన్ని ముగించారు. సమావేశంలో మాజీ ఎంపీ దేవేందర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నేతలు నామా, రేవూరి, రావుల, మండవ వెంకటేశ్వరరావు,  అన్నపూర్ణమ్మ, అరవింద్‌ కుమార్‌గౌడ్, బి.మల్లయ్యయాదవ్, వీరేందర్‌గౌడ్, బండ్రు శోభారాణి, నన్నూరి నర్సిరెడ్డి, జక్కిలి అయిలయ్య యాదవ్, యూసుఫ్, తాజుద్దీన్‌ పాల్గొన్నారు.  

అది రాజకీయమా? 
‘‘నేను ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, తెలంగాణ ప్రయోజనాల గురించి ప్రధాని మోదీపై అవిశ్వాసం పెడితే.. నాకు పరిపక్వత లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తద్వారా మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నించారు. అది రాజకీయమా.. అది న్యాయమా?’’అని చంద్రబాబు ప్రశ్నించారు. తనకు పరిపక్వత లేదన్న మోదీ 2002లో ముఖ్యమంత్రి అయితే.. తాను 1994లోనే అయ్యానని అన్నారు. రాజకీయ మిత్రులుగా టీడీపీ, బీజేపీ ఉన్నప్పుడే.. తెలంగాణ బీజేపీ కనీస ధర్మం పాటించకుండా తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని ఏకపక్షంగా ప్రకటించిందని చెప్పారు. తెలంగాణలో మళ్లీ తాను అధికారంలోకి రావాలని కొందరు అన్నారని, ఇక్కడ తాను సీఎంగా ఉండటం కుదరదని చంద్రబాబు స్పష్టం చేశారు. సమష్టిగా, సమర్థంగా ముందుకెళ్లే అలవాటు తెలంగాణ నేతలు నేర్చుకోవాలని, పూర్తిగా అండగా ఉండి ముందుకు తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. 

>
మరిన్ని వార్తలు