నవరత్నాలకు సహకారం అందిస్తాం: రాజీవ్‌ కుమార్‌

13 Sep, 2019 16:43 IST|Sakshi

నీతి ఆయోగ్‌ అధికారులతో సీఎం జగన్‌ భేటీ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల పథకానికి తమ వంతు కృషి అందిస్తామని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌, ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆయన ప్రశంసించారు. మూడు నెలల్లోనే అద్భుత పనితీరు చూపారని కితాబిచ్చారు.  సచివాలయంలో నీతి ఆయోగ్‌ బృందంతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి  కార్యక్రమాలు.. వాటి పరిస్థితులపై రంగాల వారీగా అధికారులు...నీతి ఆయోగ్‌ వైఎస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌కు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నిరక్షరాస్యతను అధిగమించడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ వారికి తెలిపారు. దీనికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్‌ బృందానికి వివరించారు.

ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మెరుగైన పనితీరును కనబర్చారని, జగన్‌ ఆలోచన విధానం, అంకితభావం, విజన్‌ తనను ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు తమ వంతు సహయం అందిస్తామని తెలిపారు. రాష్టంలో నిరక్ష్యరాసత్య జాతీయ సగటు కన్నా ఎ‍క్కువగా ఉందని, మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్లో మానవ వనరుల వృద్ధి కోసం సగానికి పైగా కేటాయించడం అభినందనీయమన్నారు. 

గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై, పెట్టుబడులు, పబ్లిక్‌ రుణాలపై.. సీఎం దృష్టి పెట్టాలని రాజీవ్‌ కుమార్‌ కోరారు. దేశవ్యాప్తంగా పప్పు దినుసులు, నూనెగింజల సాగును  పెంచడానికి తాము ప్రయత్నిస్తున్నామని, వాటికి సరైన మద్దతు ధర ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల్లో రక్తహీనత అధికంగా ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోని మహిళా, శిశుసంక్షేమంపై దృష్టి సారించాలని రాజీవ్‌ కుమార్‌ సూచించారు.

చదవండి: సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..  నిరక్ష్యరాస్యతను జీరో స్థాయికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 44వేలకు పైగా ఉన్న పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, మొదటి దశలో 15వేల పాఠశాలల్లో 9 రకాల కనీస సదుపాయలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చేఏడాది నుంచి ఒకటి నంచి ఎనిమిదవ తరగతి వరకు, తరువాత సంవత్సరంలో 9, 10 తరగతుల్లో.. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తన్నట్లు స్పష్టం చేశారు. ఏడాదికి రూ. 15 వేలు అందిస్తామని, అలాగే పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

అనంతరం గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత అధికంగా ఉందని, పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి చేపడుతున్న చర్యలను నీతి ఆయోగ్‌ అధికారులకు వివరించారు. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగు నీటిని అందించేందుకు వాటర్‌గ్రిడ్‌ను తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. అంగన్‌వాడీలు, మధ్యాహ్నా భోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఆహారంలో నాణ్యతను పెంచి విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని సీఎం స్పష్టం చేశారు. అమ్మ ఒడిని కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ స్పాన్సర్‌ చేస్తే ఈ పథకం దేశానికి స్పూర్తిగా నిలుస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. ఆరోగ్య సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, దీనికోసం ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేర్చుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలన్నింటిని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని, వీటిని నాడు-నేడు కింద అభివృద్ధి చేస్తున్నమని తెలిపారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించామని అన్నారు.  

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.‘‘రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నాం. విభజన కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగింది. దాన్ని అధిగమించేందుకు నీతి ఆయోగ్‌ సహకారం అవసరం. పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం.. ఈరంగాలే రాష్ట్ర అభివృద్ధికి చోదకాలు. 15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రాభివృద్ధితో  రాష్ట్రాన్ని మోడల్‌ స్టేట్‌గా తయారు చేయాడానికి సీఎం సంకల్పించారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కడప స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. గడచిన అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేశాం. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితోపాటు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్‌, గుమ్మనూరు జయరాములు, ఇతర ప్రధాన అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు