ప్రొసీజర్స్‌ సీఎస్‌ ఫాలో కావాలి: సీఎం

7 May, 2019 19:21 IST|Sakshi

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ప్రొసీజర్స్‌ ఫాలో కావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదుసార్లు క్యాబినేట్‌ మీటింగ్‌ పెట్టారు.. తాము పెడితే అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. ఏ ఎజెండాపై చర్చించాలనే దానిపై తమకు స్పష్టత ఉందన్నారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలంటే మీరు తీసుకోండని పరోక్షంగా సీఎస్‌కు సూచించారు. ఏపీలో క్యాబినేట్‌ ఎప్పుడు పెట్టాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది..దాన్ని సీఎస్‌ అమలు చేయాలని వ్యాక్యానించారు.

తానేం మొదటిసారి ముఖ్యమంత్రిని కాదని, ఈవీఎంల అంశంపై అన్ని రాజకీయ పార్టీలు శ్రద్ధ వహిస్తున్నాయని పేర్కొన్నారు. 10, 12, 13 తేదీల్లో క్యాబినేట్‌ సమావేశం పెట్టుకునే అవకాశం ఉందన్నారు. 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలని కోరుతూ సుప్రీం కోర్టుకు చంద్రబాబుతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు వెళ్లిన సంగతి తెల్సిందే. సుప్రీం కోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. 50 శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.

‘ఈవీఎంలపై రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టులో తిరస్కరించారు. ఈసీని కలిసి మాకు ఉన్న అభ్యంతరాలను తెలియజేశాం. వీవీప్యాట్‌లను ర్యాండం కింద 5 బూత్‌లలో లెక్కిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండాలి. ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఏపీలో కొన్ని పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు పనిచేయలేదు. ఉదయం 4 గంటల వరకు ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్‌లో నిల్చున్నారు. పోరాటం చేస్తున్నది ప్రజల కోసం, మా కోసం కాద’ని వ్యాఖ్యానించారు.

‘ ఎవరి ఓటు వేశారో ఓటరు తెలుసుకోవాలనేదే మా ప్రయత్నం. బీజేపీ మాపై ఎదురుదాడి చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని, విశ్వసనీయతను కాపాడతారో లేదో ఎన్నికల సంఘమే తేల్చుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఎన్నికలసంఘాన్ని కోరామ’ని చంద్రబాబు చెప్పారు.
 

మరిన్ని వార్తలు