అమిత్‌ షాతో భేటీ : కీలక అంశాల ప్రస్తావన

14 Feb, 2020 23:13 IST|Sakshi

అమిత్‌ షా దృష్టికి మండలి రద్దు, వికేంద్రీకరణ అంశాలు

కడప స్టీల్‌ ప్లాంట్, రామాయపట్నం పోర్టుకు సహకరించాలని వినతి

కృష్ణా-గోదావరి అనుసంధానానికి ఆర్థికసాయం

అమిత్‌ షాతో భేటీలో కీలక అంశాలను ప్రస్తావించిన సీఎం జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా​కు వివరించారు. దీని కోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రణాళికలు రచించామని  తెలిపారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని హోంమంత్రికి సీఎం జగన్‌ తెలియజేశారు. దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్‌ శుక్రవారం అమిత్‌ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. సుమారు 40 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో పెండింగ్‌ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, వికేంద్రీకరణ, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్‌ షాతో సీఎం జగన్‌ చర్చించారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను విజ్ఞాపన పత్రం ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

2021 నాటికి పోలవరం పూర్తి
ప్రభుత్వ తీసుకుంటున్న వివిధ చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోందని అమిత్‌ షాకి తెలియజేశారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకూ రూ.838 కోట్లను ఆదాచేశామన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉందని, ప్రాజెక్టు రివైజ్డ్‌ అంచనాలను రూ.55,549 కోట్లుగా కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక కమిటీ ఫిబ్రవరి 2019న ఆమోదించిందన్న విషయాన్ని సీఎం జగన్‌ గుర్తుచేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ. 3,320 కోట్లు కేంద్రంనుంచి రావాల్సి ఉందని, ఆ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కేంద్ర జలవనరులశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సీఎం కోరారు.

కర్నూలులో హైకోర్టు.. న్యాయశాఖకు ఆదేశాలు
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమర్పించిన విజ్ఞాపన పత్రంలోని ముఖ్యమైన అంశాలు.. ‘రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించాం. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా అమరావతిగా ప్రణాళిక వేసుకున్నాం. హైకోర్టును కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న హామీకి కట్టుబడి ఉండాలి.

మం‍డలి రద్దుకు అసెం‍బ్లీ తీర్మానం
శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేసి అపహాస్యం చేస్తోంది. ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ.. శాసనసభ మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలి. మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు చరిత్రాత్మక చర్యలను తీసుకున్నాం. విచారణను వేగంగా పూర్తిచేసి, నిర్దేశిత సమయంలోగా విచారణ చేసి శిక్షలు విధించడానికి గట్టి చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం, ఒన్‌ స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. సరిపడా సిబ్బందితో వీటిని బలోపేతం చేసే ప్రక్రియ జరుగుతోంది.

కడప స్టీల్‌ ప్లాంట్, రామాయపట్నం పోర్టుకు సహకరించాలి..
ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆర్థిక సహాయం అందించాలి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికోసం కడప స్టీల్‌ పాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం– చెన్నై కారిడర్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్‌కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగుపరచడానికి గోదావరి నదిలో నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం చేయాలి.  పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా హైదరాబాద్‌లోని ఉండిపోయాయి.. ఈ విషయంలో ఏపీ పోలీసు విభాగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. నిధులలేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాం. అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ పోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రాజెక్టును హోంమంత్రిత్వ శాఖ 2017లో ఆమోదించింది.. దీనికి రూ.152 కోట్లు కేంద్రం ఇవ్వాలి. మరో రూ. 01.4 కోట్లు రాష్ట్రం భరించాలని నిర్ణయించగా, రాష్ట్రంలో గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు మూతపడింది. స్టేట్‌ ఆపరేషనల్‌ కమాండ్, కంట్రోల్‌ సెంటర్, సెంట్రలైజ్డ్‌ డేటా సెంటర్, ఏపీ పోలీస్‌ అకాడమీ ఏర్పాటుకు తగిన సహాయం చేయాలి. శాంతిభద్రతలను కాపాడేందుకు, ప్రజల భద్రతకోసం గట్టి చర్యలను తీసుకునేందుకు వీలుగా ప్రస్తుతం కేడర్‌ స్ట్రెంత్‌ను 79 సీనియర్‌ డ్యూటీ పోస్టులను 96కు పెంచాలి.

మరిన్ని వార్తలు