‘చంద్రబాబూ నీ బుద్ధి మార్చుకో’

5 Oct, 2019 08:33 IST|Sakshi

సాక్షి, పెనుమూరు(చిత్తూరు) : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని శుక్రవారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి మొక్కు తీర్చుకున్నారు. పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన పులిగుండు వద్ద పులిగుంటీశ్వరునికి తలనీలాలు సమర్పించారు. పులిగుండు ఎక్కి దేవతలను దర్శించుకున్నారు. 2015 జనవరి 17వ తేదీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామి చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డితో కలిసి సుమారు 1,200 అడుగులు ఎత్తున్న పులిగుండు ఎక్కారు. వైఎస్‌ జగ,న్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే తిరిగి పులిగుండు ఎక్కుతానని, పులిగుంటీశ్వరస్వామికి తలనీలాలు సమర్పిస్తానని అప్పట్లో మొక్కుకున్నారు. శుక్రవారం ఉదయం చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి సమక్షంలో పులిగుంటీశ్వరస్వామికి తలనీలాలు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పులిగుండు ఎక్కి దేవతామూర్తులను దర్శించుకున్నారు. 

చంద్రబాబూ నీ బుద్ధి మార్చుకో
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చుకోవాలని, అబద్ధాలు చెప్పడం మానాలని  నారాయణస్వామి చెప్పారు. పులిగుండు వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబుతో పాటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్‌సీపీ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు పెట్టించారన్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 150 అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఒక్క అక్రమ కేసు పెట్టలేదన్నారు. తమ ప్రభుత్వంలో ఒక్క తప్పుడు కేసుపెట్టినట్లు చెప్పినా నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామన్నారు. కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్థనరాజు, అతని అనుచరులు తప్పతాగి కారులో తలకోనకు వెళుతూ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారని, ఈ విషయం పోలీసుల దృష్టికి వస్తే వారు మానవతా దృక్పథంతో  నిందితులపై కేసు నమోదు చేశారని తెలిపారు.

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు గురువారం చంద్రబాబునాయుడును కలిస్తే ఆయన తమ పార్టీ నేతలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందడం మంచి పద్ధతి కాదని, ఆ వీడియోను ఒక్కసారి చంద్రబాబు చూడాలని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గాంధీ జయంతి రోజు మద్యం విక్రయాలు జరగలేదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజున మద్యం విక్రయాలు జరిగాయని చెప్పడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీ విజయానందరెడ్డి, మండల కన్వీనర్లు సురేష్‌రెడ్డి(పెనుమూరు), పేట ధనుంజయరెడ్డి(వెదురుకుప్పం) తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా