అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు విడ్డూరం: విష్ణుకుమార్‌

22 Feb, 2020 11:35 IST|Sakshi

సాక్షి, విశాఖ : విజిలెన్స్‌ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈఎస్‌ఐ మందుల కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ..‘టెలీ మెడిసిన్‌ విషయంలో ప్రధానమంత్రి చెబితేనే చేశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం అభివృద్ధి పనులపై రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది కానీ అవినీతి చేయమని చెప్పదు. టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్డారు. మరో రాష్ట్రంలో తప్పు జరిగిందని అదే తప్పులు చేస్తాం అనడం సరికాదు. తినడానికి అలవాటు పడ్డారు అది మందులు కావచ్చు...మరేదైనా సరే అది దోచుకోవడమే. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!)

చంద్రబాబు నాయుడుకి దగ్గర అవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక​ వార్డులో బీజేపీ నుంచి 300మంది నాయకులు టీడీపీలో చేరిపోయారని గంటా ప్రచారం విడ్డూరంగా ఉంది. టీడీపీ దూరం పెట్టిందని గంటా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గంటా కారు నంబర్‌ 1..అలాగే తప్పుడు ప్రచారం చేయడంలో కూడా ఆయన నంబర్‌ వన్‌. ఇలాంటి నాయకులను నమ్మడం వల్లే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు దక్కాయి. టీడీపీ చేరినవారంతా రూ.250 బ్యాచ్‌’ అని వ్యాఖ్యానించారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం)

చంద్రబాబు పాత్రపైనా విచారణ చేయాలి
ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్‌ చేశారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘అచ్చెన్నాయుడు అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టే మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అవినీతి బురద బీజేపీకి అంటించాలని చూస్తున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలి. టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు...ఈఎస్‌ఐకి రాసిన లేఖకు పొంతన లేదు’  అని అన్నారు.

ఈఎస్‌ఐ స్కాం: వారిని శిక్షించాలి..
విజయవాడ: మరోవైపు ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు చెందిన కోట్లది రూపాయల నిధులు దిగమింగిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలతో పాటు అధికారులను శిక్షించాలంటూ విజయవాడ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం శనివారం ఆందోళనకు దిగింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి ఈఎస్ఐ అభివృద్ధికి వెచ్చించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చందాదారులైన ఉద్యోగ,కార్మికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత‍్తున నినాదాలు చేశారు. అవినీతి నుంచి తప్పించుకునేందుకు కులం కార్డు వాడటం ఏంటని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు