వ్యవసాయం... మాటల తాయిలం

9 Mar, 2018 08:48 IST|Sakshi

నిధులివ్వకనే రైతు ఆదాయం రెట్టింపు చేస్తామంటూ గొప్పలు

సాగు కష్టాలు, గిట్టుబాటు ధరల గురించి ప్రస్తావించని వైనం

కొత్త పథకాలూ లేవు, కేటాయింపులూ లేవు

గత ఏడాది కన్నా రూ.856 కోట్లే పెంపు

అరకొర నిధులతో రైతుల ఆదాయం రెట్టింపు ఎలా?

వడ్డీ బకాయిలు చెల్లించలేక రైతుల ఇక్కట్లు

2014–15 బకాయిలకు ఇప్పుడు రూ.57 కోట్లు కేటాయిస్తారా?

సాగు విస్తీర్ణం తగ్గినా ఉత్పత్తి పెరిగిందని తప్పుడు లెక్కలు

అదెలా సాధ్యం అంటున్న రైతు సంఘాలు

సాక్షి, అమరావతి: కరువు కాటకాలతో, గిట్టుబాటుకాని ధరలతో కష్టాల సాగు చేస్తున్న రైతులకు కనీస భరోసా కల్పించకుండానే 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేస్తామంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాటలతో గారడీ చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆయన గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏ మాత్రం చాలీచాలని నిధులతో ఆదాయం రెట్టింపు ఎలా సాధ్యమో మాత్రం వివరించలేదు. వ్యవసాయానికి వరుసగా ఐదో ఏడూ ప్రత్యేక బడ్జెట్లు పెట్టినా ప్రభుత్వం ఏ ప్రత్యేకతనూ చాటులేకపోయింది. కొత్త పథకాలు లేవు, నిధుల కేటాయింపులు లేవు. జీత భత్యాలకు, ఇతర వ్యయానికి వినియోగించే రెవెన్యూ వ్యయం పోనూ పెట్టుబడులకు, మౌలికసదుపాయాల కల్పనకు కేవలం రూ.467.38 కోట్లు మాత్రమే మిగలడం గమనార్హం.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో (2017–18) వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.18,214 కోట్లు కేటాయిస్తే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి (2018–19) రూ.19,070.36 కోట్లు కేటాయించారు. అంటే మొత్తం పెంపు రూ.856 కోట్లకు మించలేదు. ఈపాటి నిధులతో 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు ఎలా అవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వడ్డీ లేని రుణాలకు గత నాలుగేళ్లుగా రూ.172 కోట్లు, పావలా వడ్డీకి రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నా ఇంతవరకు వాటిని బ్యాంకులకు జమ చేసిన దాఖలాలు లేవు.ఫలితంగా రైతులు ప్రత్యేకించి చిన్న, సన్నకారు, కౌలు రైతులకు వడ్డీలేని పంట రుణాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014–15 సంవత్సరానికున్న బకాయిలను వచ్చే ఆర్ధిక సంవత్సరంలో చెల్లించేందుకు రూ.57 కోట్లను కేటాయించారంటే ఈ ప్రభుత్వానికి కౌలు, చిన్న, సన్నకారు రైతుల పట్ల ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది.

వ్యవసాయ పరిశోధనలపైనా చిన్నచూపే..
వ్యవసారంగం అభివృద్ధికి అవసరమైన పరిశోధనలకు కూడా కేటాయింపులు ఏ మాత్రం పెంచలేదు. పైగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి గతంలో కంటే రూ.23 కోట్ల మేర నిధులు తగ్గాయి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎలాంటి కేటాయింపులు లేవు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా ఊదరగొడుతున్నా ఈసారీ పైసా విదల్చలేదు. మొక్కజొన్న, పత్తి, చెరకు, వేరుశనగ పంటల్లో ఉత్పాదకత పెరిగిందని ఘనంగా చెప్పుకున్న మంత్రి ఆయా పంటలకు కనీస మద్దతు ధర లేక ఆందోళనతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి గురించి కనీస ప్రస్తావన చేయలేదు. చేస్తున్నాం, యోచిస్తున్నాం, ప్రతిపాదనలో ఉన్నాయి, ఎంవోయూలు కుదిరాయన్నవే ఎక్కువగా ఉన్నాయి తప్ప అమల్లోకి వచ్చినవి ఏమిటో చెప్పలేదు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐపీఎం)ను కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేస్తున్నామని గత బడ్జెట్‌లో చెబితే ఈసారి పది కోట్లు కేటాయించామని చెప్పి సరిపెట్టారు.

ఇలా ప్రతి ఒక్కటీ తూతూ మంత్రపు ప్రస్తావనలే తప్ప ఇది చేస్తామనే భరోసా ప్రకటించకపోవడం ఈ బడ్జెట్‌ లోపమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రూ.11.83 కోట్ల కేటాయింపుతో మార్కెటింగ్‌ శాఖకు ఏం మౌలికవసతులు సమకూర్చుతారని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రతిపాదించిన కేటాయింపుల్లో రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ బకాయిలు, ఉపాధి హామీ పనుల అనుసంధానికి కేటాయింపులు పోను మిగిలింది దాదాపు శూన్యమే.

సాగు విస్తీర్ణం తగ్గితే ఉత్పత్తి ఎలా పెరిగిందో?
2014–15లో 160.03 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే ఆ తర్వాత ఎన్నడూ ఆ స్థాయిలో దిగుబడి రాలేదు. నిజానికి మూడేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది 20 శాతం విస్తీర్ణం తగ్గినట్టు అనధికార లెక్కలు చెబుతుండగా అటువంటి పరిస్థితుల్లో ఉత్పత్తి ఎలా పెరుగుతుందని రైతు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మత్స్యరంగంలో వచ్చిన పెరుగుదలను, రాబడిని వ్యవసాయ రంగ అభివృద్ధిలో చూపి రైతుల్ని మభ్యపెట్టడం సరికాదని వాదిస్తున్నాయి. మొత్తం మీద ఈ బడ్జెట్‌ రైతులకు భరోసా ఇవ్వలేక పోయింది.

కౌలు రైతుకు మరోసారీ అరకొరే
గత ఏడాది పంటల రుణాల కింద రూ.63 వేల కోట్లు ఇవ్వగా అందులో కౌలు రైతులకు దక్కింది కేవలం రూ 2,346 కోట్లే. అంటే కేవలం 3.7 శాతం అని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం ధ్వజమెత్తింది. సాగు భూమిలో 80 శాతం పంటలు పండించేది కౌలు రైతులే అయినా రుణమాఫీలో తీవ్ర అన్యాయం జరిగినా సవరించే ప్రయత్నం ఈ బడ్జెట్‌లోనూ జరగలేదు. రైతులకు కావాల్సింది రుణమాఫీ, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు. కాని ఇవేమీ బడ్డెట్‌లో లేవు. గత బడ్జెట్‌లో గొర్రెలు, మేకల పెంపకందారులకు లక్ష రూపాయల విలువైన గొర్రెల యూనిట్‌ను మంజూరు చేస్తామని ప్రకటించినా అది ఏమైందో ప్రస్తావనే లేదు.

మరిన్ని వార్తలు