జగిత్యాలలో ఏపీ ఇంటెలిజెన్స్‌ రహస్య సర్వే!

28 Oct, 2018 02:37 IST|Sakshi
ధర్మపురిలో కనిపించిన పోలీసులు

ధర్మపురిలో పట్టుబడిన ముగ్గురు అధికారులు?

ఇటీవల కోరుట్లలో ఓ వలస నేతతో భేటీ

సాక్షి, జగిత్యాల: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ పోలీసుల రహస్య సర్వే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కలకలం రేపుతోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసుల సర్వే పలు అనుమానాలకు దారి తీస్తోంది. వారం క్రితం కోరుట్ల నియోజకవర్గానికి చెందిన ఓ పార్టీ వలస నేతను (ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు) ఇంటెలిజెన్స్‌ అధికారి ఒకరు కలవడం.. తిరిగి సొంతగూటికి రావాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

తాజాగా ఈ నెల 26న ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన ముగ్గురు ఇంటెలిజెన్స్‌ పోలీసులు రహస్య సర్వే నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అభ్యర్థుల విజయావకాశాలపై స్థానికులతో ఆరా తీస్తూ జిల్లా పోలీసులకు చిక్కారు. ఏపీ పోలీసుల మాటతీరును గమనించిన స్థానికులు.. విషయాన్ని ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే రంగంలో దిగిన ధర్మపురి పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాము ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెం దిన వాళ్లమని చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యా రు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు కూడా పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసులు రాష్ట్రంలో సర్వే నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్‌ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.

జిల్లాలోనే మకాం?
ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్‌ సిబ్బంది 25 మంది 15 రోజుల నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మకాం వేసినట్లు తెలుస్తోంది. కోరుట్ల, ధర్మపురిలో వెలుగుచూసిన ఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లోనూ ఏపీ పోలీసులు సామాన్య వ్యక్తుల్లా సర్వే చేస్తుండటంతో విషయం వెలుగులోకి రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమిలో ఓ పార్టీ అభ్యర్థులపై ఇంటెలిజెన్స్‌ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇదే క్రమం లో ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ స్థితిగతులు, నాయకులపై ఆరా తీస్తున్నారని ధర్మపురి ఘటనతో స్పష్టమైం ది. సామాన్య వ్యక్తుల్లా సర్వే చేస్తుండటంతో తమ కం టబడలేదని జిల్లా పోలీసులు చెబుతున్నారు. కాగా, ఏపీ ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని స్థానిక పోలీసులు విచారణ లేకుండానే వదిలిపెట్టడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. వారిని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై ధర్మపురి ఎస్‌ఐ అంజయ్య వివరణ ఇస్తూ, ‘ధర్మపురిలో అనుమానాస్పదస్థితిలో ముగ్గురు తిరుగుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. వెంటనే బ్లూ కోల్ట్స్‌ బృందాన్ని పంపించాం. అక్కడికెళ్లాక వారు హైదరాబాద్‌ నుంచి వచ్చిన పోలీసులమని చెప్పడం తో అక్కడి నుంచి వచ్చేశాం’ అని చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు