బాబు తీరును ఎండగట్టిన మంత్రులు

3 Mar, 2020 22:01 IST|Sakshi

సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును మంత్రులు ఎండగట్టారు. చంద్రబాబు నక్కబుద్ధి, దొంగ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నట్టు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, గుమ్మనూరు జయరాం, ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు మంత్రులు మంగళవారం పత్రికా ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని గుర్తుచేశారు. ఈ అఫిడవిట్‌ ద్వారా బీసీ వర్గాలకు మేలు జరగకుండా చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని ముఖ్య అంశాలను మంత్రులు ప్రజలకు వివరించారు. 

మంత్రులు చెప్పిన అంశాలు..

  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్, రూరల్‌డెవలప్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్‌ సెక్రటరీలు చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులోని పాయింట్‌ నంబర్‌ 25లో 50శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో దాటరాదన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు, విభజన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తిస్తుందని చెప్పారు. 
  • టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని 26వ  పాయింటులో సుప్రీంకోర్టు 2016 ఫిబ్రవరి 8న ఇచ్చిన తీర్పులో ఏం చెప్పిందో కూడా రాశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయినందున 60.55శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రశ్నలకు ఇప్పుడు తాము సమాధానం చెప్పదలుచుకోలేదని, కాబట్టి పిటిషన్లు డిస్మిస్‌   చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. 
  • ఆ అఫిడవిట్‌లోని 27వ పాయింటులో ఈ అంశాన్ని మరింత వివరంగా చెప్పారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రమే రిజర్వేషన్లు 50శాతం మించడాన్ని అంటే, 60.55శాతం ఉండటాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది తప్ప భవిష్యత్తులో మరే ఎన్నికలకూ దీన్ని  వర్తింపచేసే అవకాశం లేదని 27వ పాయింటు చివరి వాక్యంలో చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇంగ్లిషులో చెప్పాలంటే ఇట్‌  కెనాట్‌ బీ ఎక్స్టెండెడ్‌ ఫ్యూచర్‌ ఎలక్షన్స్‌ అంటూ సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కాబట్టే..స్పెషల్‌ఆఫీసర్లను నియమించుకోక తప్పడంలేదంటూ ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఈ నెపాన్ని వారిచ్చిన అఫిడవిట్‌కు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వంమీద నెడుతోంది. 
  • యాభైశాతం రిజర్వేషన్లు మించడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అనుమతించడంలేదంటూ సాక్షాత్తూ మరోసారి హైకోర్టుకు తెలిపిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని 59.75శాతం రిజర్వేషన్లు కావాలని దొంగ డిమాండ్లు చేయడం ఎంతవరకూ సహేతుకం. ఈ అఫిడవిట్‌ చంద్రబాబు దొంగ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోంది.
మరిన్ని వార్తలు