పవన్‌కు ముందుంది మొసళ్ల పండుగ!

20 Mar, 2018 20:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: నిన్నమొన్నటి వరకు మిత్రపక్షంగా పరిగణించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ నేతలు ఇప్పుడు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన, లోకేశ్‌ అవినీతిపై పవన్‌ ఆరోపణలు చేయడంతో టీడీపీ మంత్రులంతా పవన్‌పై అగ్గిమీద గుగ్గిలంలా విరుచుకుపడుతున్నారు. పవన్‌కు రాజకీయ పరిణతి లేదని, లోకేశ్‌ విషయంలో ఆయన రోజుకో మాట చెప్తున్నారని మండిపడుతున్నారు. ఏపీ మంత్రులు చినరాజప్ప, నారాయణ, టీడీపీ నేతలు వర్ల రామయ్య మంగళవారం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి మరీ.. పవన్‌పై విమర్శల వర్షాన్ని కురిపించారు. వారు ఏమన్నారంటే..

పవన్‌కు అంత పరిణతి ఉందా?
జనసేన సభలో పవన్ లోకేశ్‌ విషయమై ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివారు. చంద్రబాబుకు మార్కులు ఇచ్చే రాజకీయ పరిణతి పవన్‌కు ఉందా? లోకేశ్‌పై పవన్ రోజుకోక మాట మాట్లాడుతున్నారు. జనసేన విధివిధానాలు లేని పార్టీ. పవన్‌కు ప్రజలు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెపుతారు. రాజకీయంగా పవన్‌కు అవగాహన లేదు. పవన్‌కు దిశానిర్ధేశం లేదు.
-  కళా వెంకట్రావు, టీడీపీ నేత

ఆధారాలు ఉంటే బయటపెట్టాలి
పవన్ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పలేదు. బీజేపీపై ఆయన ఎందుకు విమర్శలు చేయలేదు? మోదీ డైరెక్షన్‌లో పవన్‌ పని చేస్తున్నారు. పవన్ బీజేపీతో కలిసి పని చేస్తారు. హోదా గురించి ఎందుకు పవన్ మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ హీరో నుంచి జీరో అయ్యారు. లోకేష్ అవినీతిపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలి
-చిన రాజప్ప, డిప్యూటీ సీఎం


చిరంజీవే కారకుడు
పవన్ కామెంట్స్‌ గందరగోళం సృష్టిస్తున్నాయి. గతంలో హోదా కోసం ఎంపీల మద్దతు కూడగడతానన్న పవన్ మాటలు ఏమైయ్యాయి. పవన్‌కు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవు. రాజకీయాల్లో ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవడం మంచిది కాదు. లోకేశ్‌ అవినీతి గురించి పవన్‌కు చెప్పిన 40 మంది ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలి. పవన్ ఒకసారి హోదా, మరోసారి నిధులు కావాలని అడుగుతున్నారు. రాష్ట్ర విభజనకు చిరంజీవి కారకుడు.
- నారాయణ, మంత్రి

పవన్‌కు ముందుంది మొసళ్ల పండుగ!
పవన్‌కు ముందుంది మొసళ్ళ పండగ. వాస్తవాలకు దూరంగా పవన్ గాలి కబుర్లు చెపుతున్నారు. ఆరోపణలు చేసినప్పుడు దాన్ని నిరూపించాలి.. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక బోగస్. చంద్రబాబు వ్యతిరేకులే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్నారు. పవన్‌ను వెనుక నుండి ఏ శక్తి నడిపిస్తుంది? ఎవరి మెప్పు కోసం పవన్ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు? శేఖర్ రెడ్డితో లోకేశ్‌కు సంబంధాలు ఉన్నాయని ప్రధాని పవన్‌కు చెప్పారా? రాజకీయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిరంజీవిలాగా పవన్ కూడా పెట్టె బెడా సర్దుకోవాల్సి వస్తుంది.
- వర్ల రామయ్య, టీడీపీ నేత

మరిన్ని వార్తలు