ఏపీ మంత్రుల రాజీనామాలు ఆమోదం

8 Mar, 2018 21:11 IST|Sakshi
కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు

సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు సమర్పించిన రాజీనామాలు ఆమోదం పొందాయి. బీజేపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ నరసింహన్ ఆమోదించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ అంగీకరించినట్లు సీఎం కార్యాలయానికి సమాచారం అందింది. కాగా, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిల రాజీనామాలు ఆమోదం పొందాయా.. లేదా అనేది తమకు తెలియదని పరకాల చెప్పారు.

'ప్రధాని మోదీతో ఫోన్‌ సంభాషణలో సీఎం చంద్రబాబు పూర్తి వివరాలు తెలిపారు. మా డిమాండ్లపై కేంద్రం అవమానకరంగా వ్యవహరించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రుల అందరి హక్కు. వీటిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అవమానకరంగా వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ ప్రజలు అసహనంతో ఉన్నారని' పరకాల తెలిపారు.

కాగా, నేటి ఉదయం కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావులు ఏపీ కేబినెట్ నుంచి వైదొలగిని విషయం తెలిసిందే. ఆ మేరకు తమ రాజీనామా లేఖలను బీజేపీ నేతలు గురువారం ఉదయం అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. సీఎం ఛాంబర్‌లో కామినేని భేటీ అయి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా లేఖ ఇచ్చిన మూడు నిమిషాల్లోనే మంత్రి మాణిక్యాలరావు వెనుదిరిగారు. బీజేపీ మంత్రులు తమ అధికారిక వాహనాలు, ఐడీ కార్డులను సంబంధిత అధికారులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు