ఏపీలో పొత్తులపై కాంగ్రెస్ క్లారిటీ

23 Jan, 2019 17:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఉమెన్‌ చాందీ తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పొత్తులపై తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీదేనని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు గానీ బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మాత్రం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమతో ఉంటారని తెలిపారు.

ఫిబ్రవరి 1న రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం : రఘువీరా
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. విభజన హామీలు అమలు చేసేది, ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్‌ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని, ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర బంద్‌లో పాల్గొంటామని తెలిపారు. పొత్తులపై నిర్ణయం తీసుకుంది ఏఐసీసీయేనని, ప్రియాంక గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించడం శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు