గజల్‌ శ్రీనివాస్‌ కేసుపై రఘువీరా స్పందన

6 Jan, 2018 13:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న గజల్‌ శ్రీనివాస్‌ వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు. టీడీపీ ప్రభుత్వం బుద్ధే వక్రబుద్ధి అని, అందుకే అలాంటి వారిని సెలక్ట్ చేస్తోందని విమర్శించారు. గజల్ శ్రీనివాస్ తమ పార్టీలో  తిరగలేదని, స్వచ్ఛంగా ఉండాల్సిన అంబాసిడరే ఇలా చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రఘువీరా అన్నారు.

రేపటి నుంచి పోలవరం యాత్రం..
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు పాదయాత్ర చేపడుతున్నామని రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారిని రఘువీరా రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేపటి నుంచి 10 తేదీవరకు ధవళెశ్వరం నుండి పోలవరం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నాం. 10న పోలవరంలో సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం పూర్తి చేయాలి. పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు ఏవిధంగా ‌పంచుకోవాలి అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పాదయాత్రను విజయవంతం చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించాలని అమ్మవారిని వేడుకున్నాం’ అని రఘువీరా అన్నారు.

ఇంద్రకీలాద్రి పై తాంత్రిక పూజలపై..
‘ఆలయంలో అర్ధరాత్రి పూజలు జరిగాయని దుర్గగుడి చైర్మన్ ఒప్పుకున్నారు. అధికారులతో మాట్లాడుదామంటే భయపడిపోతున్నారు. దుర్గమ్మ సన్నీధిలో ఎవ్వరూ అబద్ధాలు ఆడలేరు. అలాగని నిజం చెప్పాలంటే నోటికి తాళాలు వేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా దుర్గగుడి లో ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంది. గతంలో అమ్మవారి ముక్కుపుడక విషయంలో ప్రభుత్వం మూల్యం చెల్లించుకొంది. ఆలయంలో పాలక మండలి నోరు మెదపకూడదని టీడీపీ నేతలు హుకుం జారీ చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే’ అని రఘువీరా అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ వ్యవహారంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం, దేవాదాయశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పూజలు జరిగాయనేది వాస్తవమని, జరగలేదని బుకాయించొద్దని సూచించారు. ఈ వ్యవహారంపై సిట్డింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి, లేకుంటే టీడీపీ సర్కారు మళ్లీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు