‘ఉమ్ము నీ మొహం మీదే పడుతుంది.. చూస్కో..’

12 Jan, 2020 13:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై తప్పుడు విమర్శలు చేసిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు బాబుకు బుద్ధి చెప్పారని, అవాకులు చవాకులు పేలితే తాము కూడా ఆయనను వెలివేస్తామని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో నీతి నిజాయితీగా పనిచేసి పోలీస్‌ శాఖకు పేరు తీసుకొచ్చారని వారు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సవాంగ్‌ను మంచి అధికారి అని పొగిడిన బాబు.. అధికారం చేజారండంతో విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. 34 ఏళ్లుగా రాష్ట్రానికి సేవలందిస్తున్న మచ్చలేని ఉన్నతాధికారిపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.

‘34 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ.. పోలీస్‌ శాఖనే తన కుటుంబంగా భావించి విధులు నిర్వహిస్తున్న మా డీజీపీపై మరోసారి తప్పుడు విమర్శలు చేస్తే నీకు కనీస మర్యాద కూడా ఇవ్వం. పోలీస్‌ శాఖలో ప్రతి ఒక్కరూ ఆయన అందించిన సేవలు.. సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నవారే. గుండె నిండా నిరంతరం పోలీస్‌ సంక్షేమాన్ని గురించి తపించే అధికారి మా డీజీపీ. అంతటి గొప్ప వ్యక్తి డీజీపీగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. అటువంటి అధికారిపై తప్పుడు విమర్శలు చేస్తున్నావు.

సూర్యుడిపై ఉమ్మి వేస్తే.. అది నీ మొహం మీదే పడుతుంది చూస్కో. ఒక అధికారిని ప్రాంతం వారీగా చూస్తున్నావు. దక్షిణ భారత, ఉత్తర భారత, ఈశాన్య భారత అనే భేదభావాలు సృష్టిస్తున్నావు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న నిన్ను దేశద్రోహి అని ఎందుకు అనకూడదు? పోలీస్‌ శాఖలో ఎన్నడూ లేని విధంగా కులాల వారీగా విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నువ్వు సంఘద్రోహివి. పోలీసులను బానిసలుగా వాడుకున్నావు. పోలీసుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. సాక్షాత్తు గౌరవ రాష్ట్రపతి నుంచి ఉత్తమ అధికారిగా మా డీజీపీ కితాబు అందుకున్నారు. ఆయన గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. నిన్న మీ పార్టీ సినీ నటి దివ్యవాణి మతి భ్రమించి మాట్లాడారు. ఆమె మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’అని ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు