ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం అఫిడవిట్‌

28 Jul, 2018 20:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంపై ఈ ఏడాది మూడు సార్లు భేటీ అయ్యామని, షెడ్యూల్‌ 10 ప్రకారం కేంద్ర సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయో.. అక్కడే కొనసాగుతాయని, అంతే తప్ప ఆస్తుల పంపకం చేయమని కేంద్రం తెలిపింది. షెడ్యూల్‌ 10 కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో 142 సంస్థలున్నాయని చెప్పింది. అయితే 13వ షెడ్యూల్‌ కింద ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థను ఏపీలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యక​త ఉందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుపై కూడా నివేదిక అందిందని, ఇప్పటికే దేశంలో 16 రైల్వే జోన్లు ఉన్నాయని, మరొక జోన్ ఏర్పాటు దాదాపుగా సాధ్యమయ్యే పనికాదని, నిర్వహణపరంగా కూడా లాభదాయకం కాదని కేంద్ర చెప్పింది. అయితే దీనిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు,  స్టేక్ హోల్డర్లతో చర్చించిన తర్వాత తీసుకుంటామని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్‌ ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో వాణిజ్య, పారిశ్రామిక ఆస్తులు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఏ ప్రాంతంలో ఉంటే, ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలిపింది. ఉద్యోగుల పంపిణీ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయని కూడా తేల్చి చెప్పింది. 

‘ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఫారెస్ట్‌ అధికారుల పంపిణీ ఇప్పుడే పూర్తయింది. దీనిపై 12 మంది ఐఏఎస్‌ అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ కోసం కమల్‌నాథ్‌ కమిటీ ఏర్పాటైంది. పోలీసు శాఖలోని 753 మంది ఉద్యోగుల విషయంలోనే ఇంకా తుది నిర్ణయం రాలేదు. చట్టంలోని అన్ని అంశాలు పూర్తయ్యాయి లేదా తుది దశలో ఉన్నాయి. పొంగులేటి అఫిడవిట్‌ను తిరస్కరించండి’ అని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు