మా రాజీనామాలతో  పోరాటం ఆగదు: ఎంపీ అవినాష్‌రెడ్డి

21 Apr, 2018 11:16 IST|Sakshi
వైఎస్‌ఆర్‌ విగ్రహానికి  నివాళులు అర్పిస్తున్న  ఎంపీ, ఎమ్మెల్యేలు

హోదా ఉద్యమాన్ని ప్రతి పౌరుడు సొంతం చేసుకోవాలి

కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి పిలుపు

టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే కేంద్రం దిగి వచ్చేది

చంద్రబాబు తన జల్సాల కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని విమర్శ 

కడప కార్పొరేషన్‌ : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రతి పౌరుడు సొంతం చేసుకోవాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆరు రోజులపాటు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసి మొదటిసారి కడపకు వచ్చిన వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో  ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌. రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిలతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో

ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా, విభజన హామీలైన కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజ పట్నం పోర్టు, పెట్రో కెమికల్‌ ఫ్యాక్టరీ, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం నాలుగేళ్లుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తోందని తెలిపారు. గత ఫిబ్రవరిలో ఈ డిమాండ్ల సాధన కోసం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించారన్నారు.

పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఏప్రిల్‌ 6వ తేదిలోగా హోదాపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారని గుర్తు చేశారు. అందులో భాగంగానే తాము పార్లమెంటులో 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి చర్చకు, ఓటింగ్‌కు పట్టుబట్టామన్నారు. చర్చ జరిగితే తాను దోషిగా నిలబడాల్సి వస్తుందనే కేంద్రం చర్చ జరపకుండా విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.  ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మొదటి ముద్దాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండో మొదటి ముద్దాయి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి స్పష్టమైన స్టాండ్‌ లేదని విమర్శించారు.

రాజకీయాలు ఎన్నికల సమయంలో చేసుకుందాం, ఇప్పుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 25 మంది ఎంపీలతో రాజీనామాలు చేయించి పిడికిలి బిగించి కేంద్రాన్ని బలంగా కొడదామని వైఎస్‌ జగన్‌ పిలుపునిస్తే చంద్రబాబు ముందుకు రాలేదని విచారం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే దేశం మొత్తం చర్చ జరిగేదని, కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా చేశారని అన్నారు. 
ధర్మం లేదు.. పోరాటం లేదు.
ధర్మ పోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి చేసే దీక్షలో ధర్మం లేదు, పోరాటం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇళ్లు, ప్రయాణాలు, తన జల్సాల కోసం ఇష్టం వచ్చినట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అయ్యాక ఏపిపై తొంబై వేల కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు రెండు లక్షలా 30 వేలకోట్లు అప్పులున్నాయన్నారు. రైతు రుణమాఫీ ఇంకా కాలేదు, డ్వాక్రా రుణమాఫీ పూర్తి కాలేదు, నిరుద్యోగ  భృతి అసలే ఇవ్వలేదు, మరి ఇంత అప్పు ఎలా అయిందని నిలదీశారు. ప్రత్యేక హోదా ఉద్యమం తమ రాజీనామాలతోనే ఆగదని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో  దీన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకు వెళ్తామని స్పష్టం చేశారు. 
చంద్రబాబుది 420 దీక్ష: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి  
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏప్రిల్‌ 20వ తేదీన ధర్మపోరాట దీక్ష 420 దీక్ష అని మైదుకూరు శాసనసభ్యులు ఎస్‌. రఘురామిరెడ్డి విమర్శించారు. హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని, రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలిపిన విషయం చంద్రబాబు మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేవారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో ఏడు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదని మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దీక్ష ఎక్కడ చేస్తున్నారని, ఎవరి సొమ్ముతో చేస్తున్నారని ప్రశ్నించారు.  
దొంగదీక్ష: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి 
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే టీడీపీ నాయకులు దొంగనాటకాలు ఆడారని «ధ్వజమెత్తారు. తమ లోక్‌సభ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తే, టీడీపీ ఎంపీలు చేయకపోగా రాజ్యసభ ఎంపీలను రాజీనామా చేయమని చెప్పడం దారుణమన్నారు. టీడీపీ లోక్‌సభ ఎంపీలతో రాజీనామా చేయించకుండా ఆమాట ఎలా చెప్తారని నిలదీశారు. చంద్రబాబు దీక్ష దొంగ దీక్ష అని విమర్శించారు.

హోదా కోసం ఉద్యమాలు చేసేవారిపై కేసులు పెట్టి సీఎం అణిచివేస్తున్నారన్నారు. ఆయన దీక్షకు మాత్రం జిల్లాకు కోటి రూపాయలు కేటాయించి ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తోలడం దారుణమన్నారు. ఇది అంతం కాదు ఆరంభమేనని, రాబోయే ఎన్నికల్లో ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో ఆ పార్టీకే తమ పార్టీ మద్దతు పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పులి సునిల్‌కుమార్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కరీముల్లా, నగర అధ్యక్షుడు షపి, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శివప్రసాద్, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, పవర్‌ అల్తాఫ్, ఆయూబ్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు