రేవంత్‌ వ్యాఖ్యలపై మౌనం ఎందుకు?

20 Oct, 2017 13:14 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు వ్యాఖ్యానించారు.  చంద్రబాబు విదేశీ పర్యటనలు అన్నీ వ్యక్తిగత పర్యటనలేనని ధ్వజమెత్తారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో శుక్రవారం  వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు  మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌,సోమినాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అనే పరిస్థితులు నెలకొన్నాయని వారు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌ ...టీడీపీకి ఎన్నికల ప్రాజెక్ట్‌గా మారిపోయిందని విమర్శించారు. కమీషన్ల కోసమే ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చుతోందని అన్నారు. 2018కి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని, చంద్రబాబు ప్రకటించినా, ఇప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు...
రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు సూటిగా ప్రశ్నించారు. ‘రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చే దమ్ము, ధైర్యం టీడీపీ నేతలకు ఉందా?. ఓటుకు కోట్లు కేసులో సూత్రధారులెవరో రేవంత్‌ ప్రజలకు చెప్పాలి. దేవినేని ఉమ తాను మంత్రి అన్న సంగతి మరిచిపోయి ఆరోపణలు చేస్తున్నారు. ఉమ ఇసుక మాఫియా కింగ్‌ అని ఎవరినడిగినా చెబుతారు. ప్రశ్నించినందుకు వైఎస్‌ఆర్‌ సీపీపై అబద్ధాలతో కూడిన ఎదురుదాడికి దిగుతున్నారు.’ అని అన్నారు.  ఏపీలో మంత్రులుగా ఉంటూ ...మరోవైపు కేసీఆర్‌తో కుమ్మక్కు అయింది వాస్తవం కాదా? సీఎం రమేష్‌, యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్‌ యాదవ్‌కు ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లు ఇచ్చింది నిజం కాదా?. ఏపీ ఆర్థిక పరిస్థితి, పోలవరం, అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు