2న జాతీయ రహదారుల దిగ్భందం..!

22 Feb, 2018 19:37 IST|Sakshi
టీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి (ఫైల్‌ ఫొటో)

ఏపీ ప్రజల్ని నడిరోడ్డున పడేశారు

17 పార్టీల మద్దతుతో అవిశ్వాసం

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

సాక్షి, చిత్తూరు ‌: 'టీడీపీ, బీజేపీ పార్టీలు రెండు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాయి. వారి సొంత లాభం కోసం ప్రజల్ని నడిరోడ్డున పడేశారు. నాలుగేళ్లుగా ఒకరికొకరు పొత్తు పేరిట అధికారం కొనసాగించి, ఇప్పుడు ప్రజల్ని మోసం చేయడానికి కొత్త నాటకం ఆడుతున్నారు. ఏపీకు హోదా ఇవ్వడానికి చట్టంలో సవరణ చేయాలంటున్నారు. మరి గత నాలుగేళ్లుగా ఎందుకు సవరణ చేయలేదు. 2019లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు. ఏపీకి హోదాపై తొలి సంతకం చేస్తారు..' అంటూ ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

గురువారం చిత్తూరు నగరంలోని రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం ఎదుట 'ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష' పేరిట సమావేశం నిర్వహించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల విభజన అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే జరిగిందని, ఎన్‌డీఏ, టీడీపీలు పదేళ్లపాటు హోదా ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశాయన్నారు. ఇప్పుడేమో కొత్తగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారన్నారు. జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో హోదానే ప్రజల ఎజెండాగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళుతుందన్నారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో 17పార్టీల మద్దతు కూడగట్టి పార్లమెంటులో అవిశ్వాసం పెడతామన్నారు.

టీడీపీకి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ఏప్రిల్‌ 5లోపు కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి హోదా తీసుకురావడంతోపాటు విభజన చట్టం ప్రకారం నిధులు సమకూర్చేలా ఎన్‌డీఏపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేనిపక్షంలో ప్రజాదోహుల పార్టీగా మిగిలిపోతుందన్నారు. హోదా ఇవ్వాలని డిమాండ్‌తో మార్చి 2న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్భందం.. 6,7,8వ తేదీల్లో పార్లమెంటు ముట్టడి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీ చింతా మోహన్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌భాషలు మాట్లాడుతూ గద్వాల్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజనకు మొట్టమొదట లేఖ ఇచ్చింది తమ పార్టీనేనని చంద్రబాబు నాయుడు బహిరంగంగా అంగీకరించారని, ఎన్నికల్లో ఈ నెపం మొత్తం కాంగ్రెస్‌పై వేశారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారన్నారు.

మరిన్ని వార్తలు