చంద్రబాబు నీతులు చెప్పడమా?

13 Dec, 2019 07:38 IST|Sakshi

అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా ధ్వజం  

సాక్షి, అమరాతి : 2014లో తాము మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెడితే మాట్లాడేందుకు మైక్‌ కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు నీతులు చెబుతుండడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మండిపడ్డారు. మార్షల్స్‌తో తమను బయటకు గెంటించారని గుర్తు చేశారు. సభ నుంచి తనను ఏడాది పాటు సస్పెండ్‌ చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని చెప్పారు. రోజా గురువారం శాసనసభలో మాట్లాడారు. అసలు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడేనా అని దుయ్యబట్టారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని అప్పట్లో వాయిదా తీర్మానం ఇచ్చామని, రెండోరోజు సభలో కాల్‌మనీ అంశంపై చర్చించకుండా అంశాన్ని పక్కన పెట్టారని అన్నారు.  మహిళలకు అన్యాయం జరిగిందని, దీనిపై చర్చించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా సభ నుంచి తనను సస్పెండ్‌ చేశారని, హైకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకుని, అసెంబ్లీకి వస్తే.. ఆ రోజు మార్షల్స్‌ అడ్డుకోలేదా? అని ప్రశ్నించారు.

ఆ రోజు బుద్ధి ఏమైంది?  
గట్టిగా అరిచినంత మాత్రాన గడ్డి పరక గర్జించే సింహం కాలేదనే విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని రోజా అన్నారు. ఇదే అసెంబ్లీలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ‘‘రేయ్‌ మిమ్మల్ని (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను) పాతిపెడతా.. నా..ల్లారా’’ అని రాయలేని బాషలో దుర్భాషలాడారని ఆ రోజు చంద్రబాబు బుద్ధి ఏమైందని నిప్పులు చెరిగారు. 
 

మరిన్ని వార్తలు