‘రేపు టీడీపీ నేతల ఫూల్స్‌ డే’

29 Apr, 2018 11:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాటదీక్ష చేస్తాననడంపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు ధర్మపోరాటదీక్ష అంటూ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ నాలుగేళ్లుగా విభజన చట్టంలోని అంశాలను రాష్ట్రంలో అమలు అయ్యేలా చేయడంలో టీడీపీ విఫలమైందని అన్నారు.

సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టిన చంద్రబాబు నమ్మకద్రోహి అని ఎందుకు పిలవకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా అవిరామంగా పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ చేసిన ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించ లేదా?. చంద్రబాబు నీది ధర్మపోరాటమో లేక దగా పోరాటమో ప్రజలకు అర్థమైంది. నియోజవర్గాలను పెంచితే చాలు ప్రత్యేక హోదా వద్దు అని కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగలేదా?. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకుని.. చిదంబరం, సోనియా కాళ్లు పట్టుకుని వైఎస్‌ జగన్‌పై కుట్రపన్నారు.

పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీలను కొనాలని ప్రయత్నించారు. అలాంటి చంద్రబాబు కుట్ర గురించి మాట్లాడటాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నాలుగేళ్లుగా హోదాను చంద్రబాబు ఉరి తీశారు. ప్రత్యేక హోదాపై ఆశలు కోల్పోతున్న తరుణంలో దానికి కొత్త ఊపిరులూది ప్రాణం పోసిన వీరుడు వైఎస్‌ జగనే అని ప్రజలను అడిగితే చెప్తారు. చంద్రబాబు విజయవాడలో చేసిన 12 గంటల ధర్మపోరాటదీక్ష ఆడియో ఫంక్షన్‌లా ఉంది. మళ్లీ తిరుపతిలో ఈ నెల 30న ధర్మపోరాటదీక్ష పేరుతో ప్రజలను ఫూల్స్‌ చేయాలనుకుంటున్నారు.

కానీ, ప్రజలు దీన్ని తెలుగుదేశం నేతల ఫూల్స్‌ డే అని భావిస్తున్నారు. 2016లో ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజి గొప్పదని అసెంబ్లీ సాక్షిగా మీరు వ్యాఖ్యానించలేదా?. దాన్ని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించలేదా?. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించి హోదా గురించి దేశమంతా చర్చించుకునేలా వైఎస్సార్‌ సీపీ చేసింది.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి బయటకు వచ్చిన తర్వాత మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భార్య స్వప్నకు టీటీడీ పాలకమండలిలో ఎందుకు చోటు కల్పించారు. ఇదేంటని ప్రశ్నిస్తే చంద్రబాబు అది నా పర్సనల్‌ అంటున్నారు‌. రాజకీయాల్లో ఏంటయ్యా పర్సనల్?‌. ఆ రోజు ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. గత నాలుగేళ్లలో స్వప్నకు టీటీడీలో చోటు కల్పించకుండా ఇప్పుడే ఎందుకు ఇచ్చారు?. పాలకమండలిలో సభ్యురాలిగా చేరేందుకు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు లేరా?’ అంటూ చంద్రబాబును నిలదీశారు రోజా.

>
మరిన్ని వార్తలు