ఇప్పటివరకు 1317 కుటుంబాలకు మాత్రమే పునరావాసం..

7 Jan, 2019 19:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో 56,495 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. అయితే అందులో ఇప్పటివరకు 1317 ఎస్టీ కుటుంబాలను మాత్రమే పునరావాస కాలనీలకు తరలించినట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పినట్టు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ సోమవారం రాజ్యసభకు తెలిపారు. పోలవరం నిర్వాసిత ఎస్టీ కుటుంబాలకు పునరావాసం కల్పించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు జాతీయ ఎస్టీ కమిషన్‌ రాష్ట్రపతికి సమర్పించిన నివేదిక వాస్తవమేనా అని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు.

అదే విధంగా పునరావాసం కల్పించిన కుటుంబాలకు సేద్యానికి పనికిరాని భూములు పంపిణీ చేశారా, దీని ద్వారా వారు జీవనోపాధి కోల్పోయిన విషయం వాస్తవం కాదా అనే ప్రశ్నకు కూడా కేంద్రం సమాధానమిచ్చింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులైన ఎస్టీ కుటుంబాలకు సేద్యానికి యోగ్యమైన భూములనే పంపిణీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని మేఘవాల్‌ పేర్కొన్నారు. ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులైన గిరిజనులు అనే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్‌ ప్రత్యేక నివేదిక రూపొందించింది వాస్తమేనని మంత్రి అంగీకరించారు. నిర్వాసితులైన గిరిజన కుటుంబాల సామాజిక-ఆర్థిక అభ్యున్నతి కోసం, రాజ్యాంగపరంగా వారికి సంక్రమించిన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన ముఖ్యమైన చర్యలను ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని తెలిపారు. నిర్వాసిత గిరిజన కుటుంబాలకు సాగు యోగ్యమైన భూముల పంపిణీ, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, ప్రాజెక్టు ప్రారంభానికి ముందుగానే ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులను పూర్తి చేయాలని ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వాని అందజేసిన నివేదికలో సిఫార్సు చేసిందని అన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందని వెల్లడించారు. 

కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ సమీక్షపై కమిటీ..
కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌(సీఆర్‌జెడ్‌) నిబంధనల సడలింపు అంశాన్ని సమీక్షించి, పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నెలకొల్పిందని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్‌ శర్మ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక జవాబిచ్చారు. సీఆర్‌జెడ్‌ కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలు, భాగస్వాములు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తీర ప్రాంతం కలిగిన ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టూరిజం  అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్ళను ఈ కమిటీ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. 2018లో విడుదల చేసిన కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ ముసాయిదా ప్రకటనలో ఏపీ తీర ప్రాంతాన్ని కూడా చేర్చినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు