మేమెప్పుడూ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు

1 Aug, 2018 01:20 IST|Sakshi

రణతుంగ, డిసిల్వా ఉమ్మడి ప్రకటన

కొలంబో: శ్రీలంక క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు ఆద్యులమంటూ తమపై దేశ క్రికెట్‌ బోర్డు మాజీ చీఫ్‌ తిలంగ సుమతిపాల చేసిన ఆరోపణలను మాజీ కెప్టెన్లు అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా తీవ్రంగా ఖండించారు. ‘మేమెప్పుడూ డబ్బు తీసుకోలేదు. మ్యాచ్‌లను ఫిక్స్‌ చేయలేదు’ అని వీరిద్దరూ మంగళవారం కొలంబోలో ప్రకటించారు. 1994లో లక్నో టెస్టు సందర్భంగా భారత బుకీ నుంచి రణతుంగ, డిసిల్వాలు 1500 అమెరికన్‌ డాలర్లు తీసుకున్నారని సుమతిపాల ఇటీవల ఆరోపించారు.

దీంతో మాజీ సారథులిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకువచ్చారు. ‘సుమతిపాల అధ్యక్షుడిగా ఉన్న క్రికెట్‌ కమిటీలో నేను పనిచేశా. ఒకవేళ ఫిక్సర్‌నైతే నన్ను ఎలా కొనసాగించారు? ఆయన ఆరోపణలను లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు’ అని డిసిల్వా పేర్కొన్నాడు. ‘15 వేల డాలర్లు కాదు... ప్రపంచ కప్‌ను వదులుకుంటే 15 మిలియన్‌ డాలర్లైనా ఇచ్చేవారు. అయినా మేం ఎప్పుడూ డబ్బు కోసం ఆశపడలేదు. ఆటకు అంకితమయ్యాం. దేశానికి పేరు తేవడానికి శ్రమించాం’ అని 1996 ప్రపంచకప్‌లో శ్రీలంకను విజేతగా నిలిపిన రణతుంగ స్పష్టం చేశాడు. 

మరిన్ని వార్తలు