నేడు అమిత్‌ షా రాక

6 Jul, 2019 02:54 IST|Sakshi

తొలుత గిరిజన మహిళకు పార్టీ సభ్యత్వం

అనంతరం శంషాబాద్‌లో సభ్యత్వ నమోదు ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 6న దేశవ్యాప్తంగా చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్కు వస్తున్నారు. శంషాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించనున్నారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని, 4:15 గంటలకు రంగారెడ్డి జిల్లాలోని పహాడీషరీఫ్‌ సమీపంలో ఉన్న మామిడిపల్లి గ్రామం రంగనాయకుల తండాలో గిరిజన మహిళ సోనీకి పార్టీ సభ్యత్వాన్ని అందజేస్తారు.

అనంతరం 4:30 గంటలకు శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 6:30 గంటల వరకు అమిత్‌ షా అక్కడే ఉండి, 7:15కు నోవాటెక్‌ హోటల్‌కు వెళ తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పార్టీలోకి చేరికలు ఉండకపోవచ్చని అంటున్నారు. పార్టీలో చేరాలనుకునే నాదెండ్ల భాస్కర్‌రావు వంటి ముఖ్యనేతలు కొందరు అమిత్‌ షాతో భేటీ కానున్నట్లు తెలిసింది. అనంతరం పార్టీలో చేరబోయే ముఖ్యనేతలతోపాటు కోర్‌ కమిటీ సభ్యులతో షా డిన్నర్‌ మీట్‌లో పాల్గొనే అవకాశం ఉంది. రాత్రి 8:30 గంటల వరకు అక్కడే ఉండి, 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు