‘అది హిందూ వర్సెస్‌ ముస్లిం సమస్యకాదు’

9 Sep, 2019 12:49 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : అధికరణ 370 రద్దు హిందూ వర్సెస్‌ ముస్లిం సమస్య కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ప్రజల కిచ్చిన హామీగా 370 అధికరణను రద్దు చేయడం చారిత్రక నిర్ణయమన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అధికరణ 370 తాత్కాలికమైనది. కాంగ్రెస్ పార్టీ 370 అధికరణను శాశ్వత చట్టం కింద అమలు చేసింది. సామాజిక న్యాయం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ..  కశ్మీర్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ అమలు చేయలేదు. రిజర్వేషన్ల అమలు విషయంపై కాంగ్రెస్ మాట్లాడ్డం లేదు. అధికరణ 370ని అమలు చేసి.. రిజర్వేషన్లు అమలు చేయకుండా కశ్మీర్ ప్రజలకు అన్యాయం చేసింది. 370 అధికరణ కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీతో పాటు ఇతర వర్గాల ప్రజల హక్కులకు అన్యాయం జరిగింది. 370 అధికరణ తొలగించిన తర్వాత బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా లబ్ది పొందారు.

ఏ పార్టీలైతే రోహింగ్యాల కోసం పోరాటం చేస్తున్నాయో వారు కశ్మీర్ ప్రజల హక్కుల కోసం ఎందుకు పనిచేయడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలోని రాజకీయాలను కుటుంబ రాజకీయాలుగా మార్చేసింది. అది ఓ వైరస్‌లాగా పలు రాష్ట్రాలకు వ్యాపించింది. బీజేపీ దేశ అభివృద్ధి, ఐక్యత కోసం రాజకీయాల్లో ఏ మాత్రం లాలూచీ పడదు. అమిత్‌షా ఆదేశాల ప్రకారం 400 సభలు, 2000 మంది ప్రముఖులను కలసి 370 అధికరణ రద్దును గురించి చెప్పబోతున్నాం. వైఫల్యాలను ఎత్తి చూపే విషయంలో ఏపీలో బీజేపీ ప్రతిపక్షంగా పనిచేస్తుంది. ప్రభుత్వం చేసే పనులకు రాజకీయాలను అపాదించవద్దు. బీజేపీలో చేరే వారికి కేసులనుంచి రక్షణ ఉంటుందనునుకునే వారికి ఆశాభంగం కలుగుతుంది. బీజేపీకి అతిపెద్ద ప్రతిపక్ష చరిత్ర ఉంది. బీజేపీ బలంగా ఉన్నంత కాలం దేశంలో కుటుంబ రాజకీయాలు నడపడం అసాధ్య’’మని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు