అలా అయితే ఆర్టికల్‌ రద్దయ్యేదా?: చిదంబరం

13 Aug, 2019 06:15 IST|Sakshi

చెన్నై: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో హిందువుల శాతం అధికంగా ఉంటే ఆర్టికల్‌ 370ని రద్దు చేసేవారా అంటూ బీజేపీని ప్రశ్నించారు. అక్కడ ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని సోమవారమిక్కడ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఆర్టికల్‌ రద్దుకు మతం రంగు పులిమే ప్రయత్నం కాంగ్రెస్‌ చేస్తోందని విమర్శించింది.

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయికి తగ్గించేలా కేంద్ర పాలిత ప్రాంత హోదా ఇచ్చారని విమర్శించారు. కశ్మీర్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పటికీ కశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఏమీ లేదని, ఒకవేళ ప్రశాంతంగా ఉంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లోలాగే అక్కడ ఎందుకు మీడియాను అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా తమకు, ఇతర పార్టీలు సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.

మరిన్ని వార్తలు