‘నమో టీవీ’ ఎలా వచ్చింది ?!

8 Apr, 2019 17:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నమో టీవీ’ అంటే ఏమిటీ? టాటా స్కై లాంటి ‘డీటూహెచ్‌’ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా నేరుగా ఇంటికి ప్రసారం అవుతున్న ఓ టీవీ ఛానల్‌. ఇందులో 24 గంటలపాటు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ప్రాంతాల్లో చేస్తున్న ఎన్నికల ప్రసంగాల ప్రత్యక్ష ప్రసారాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేయడంతోపాటు వాటిని మళ్లీ మళ్లీ రిపీట్‌ చేస్తోంది. మధ్యమధ్యలో బీజేపీకి సంబంధించిన ఇతర ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రసారం చేస్తోంది. ప్రసారం చేసే హక్కులు (బ్రాడ్‌కాస్ట్‌ లైసెన్స్‌) లేకుండానే ఈ ఛానల్‌ ప్రసారం అవుతోందంటూ ‘ది ఫ్రింట్‌’ పత్రిక బుధవారం నాడు ఓ వార్తను పేల్చింది. 

సెక్యూరిటీ క్లియరెన్స్‌ లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అసలు అనుమతికి ఎలాంటి దరఖాస్తును కూడా సమర్పించకుండానే ఈ టీవీ ఛానల్‌ ప్రసారం అవుతుండడం ఆశ్చర్యం.  కేంద్ర, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే టీవీ ఛానళ్లకు ఎంత కఠిన నియమ నిబంధనలు ఉంటాయో తెల్సిందే. ఓ ఛానల్‌ పేరు మార్చుకోవాలన్నా, కేవలం లోగో మార్చుకోవాలన్నా కేంద్రానికి దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలి. ఇక కొత్త ఛానళ్లకు అనమతి లభించడం కూడా కష్టమే. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ గత తొమ్మిది నెలల కాలంలో కేవలం ఆరు కొత్త ఛానళ్ళకు మాత్రమే లైసెన్స్‌లు మంజూరు చేసింది. 130 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. 

మరి ‘నమో టీవీ’ ఎలా వచ్చింది ? అది కూడా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక! ‘ది ప్రింట్‌’ వార్తపై స్పందించిన కాంగ్రెస్, ఆప్‌ పార్టీలు ఈ విషయాన్ని వెంటనే ఎన్నికల కమిషన్‌ను ఫిర్యాదు చేశాయి. స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్, వివరణ కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖకు నోటీసు జారీ చేసింది. ‘ఆ అది హిందీ న్యూస్‌ సర్వీసు’ అంటూ టాటాస్కై ట్విట్టర్‌ ద్వారా వివరణ ఇవ్వగా, ‘డైరెక్ట్‌ టు హోం సర్వీస్‌’గా వ్యవహరించే ప్రత్యేక ఫ్టాట్‌ఫారమ్‌ ద్వారా ‘నమో టీవీ’ ఛానల్‌ ప్రసారం అవుతోందని, ఆ ప్రసారాలను సాధారణంగా ‘డీటిహెచ్‌’ ఆపరేటర్లు నిర్వహిస్తారని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది. అంటే డీటిహెచ్‌ ద్వారా ప్రసారమయ్యే టీవీ ఛానళ్లకు తమ అనుమతి లేదా లైసెన్స్‌ అవసరం లేదని కేంద్రం చెప్పడమే. 

అప్పుడు 130 ఛానళ్లకు లైసెన్స్‌ అవసరం లేదు
ఈ లెక్కన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న 130 ఛానళ్ల దరఖాస్తుదారులు ఇంకేమాత్రం ప్రభుత్వం అనుమతి కోసం నిరీక్షించకుండా, లైసెన్స్‌ల కోసం కోట్లాది రూపాయలను చెల్లించాల్సిన అవసరం లేకుండానే డీటీహెచ్‌ ఆపరేటర్ల ద్వారా తమ ఛానళ్లను ప్రసారం చేసుకోవచ్చన్నమాట. పాలకపక్ష బీజేపీ చెప్పింది కనుక ఛానల్‌ ప్రసారానికి అనుమతించిన డీటీహెచ్‌ అందరి ఛానళ్లను అనుమతించకపోవచ్చు. అయితే చట్టంలో ఉన్న లోపం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కనుక, దాన్ని అడ్డం పెట్టుకొని న్యాయపోరాటం జరపవచ్చు!

‘యాడ్‌’గా పరిగణించాల్సిందే!
కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఓ టీవీ ఛానల్‌ నడుస్తున్నందున, ఆ ఛానల్‌లో నరేంద్ర మోదీ, బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్తలే ఉంటున్నందున వాటిని ఎన్నికల కమిషన్‌ వాణిజ్య ప్రకటనల (యాడ్‌) కింద పరిగణించాలి. వాటి ఖర్చులను మోదీ ఖర్చులోనో లేదా బీజేపీ ఖర్చులోనో జమ చేయాలి. వాస్తవానికి దేశంలోని మెజారిటీ ఇంగ్లీషు, హిందీ మీడియా మోదీ ప్రచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ‘నమో టీవీ’ ప్రసారాలే అవసరం లేవు.

మరిన్ని వార్తలు