వామ్మో.. ఇన్ని పేర్లు ఎలా మార్చగలం ?

6 Dec, 2018 08:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ బీజేపీని గెలిపించినట్లయితే కరీంనగర్‌ పేరును కరిపురంగా మారుస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం పేరును కూడా మారుస్తామని అంతకుముందు బీజేపీ నాయకులు తెలిపారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అలహాబాద్‌ను ప్రయాగ్‌ రాజ్‌గా, ఫైజాబాద్‌ జిల్లాను అయోధ్యగా... పలు నగరాల పేర్లను ఆదిత్యనాథ్‌ మారుస్తున్న విషయం తెల్సిందే. 

భారత దేశంలో నేడు ఉర్దూ పేర్లుగా కనిపించే అన్ని నగరాలు, వీధుల పేర్లలో 90 శాతం పేర్లు  పర్షియన్‌–అరబిక్‌ పేర్లన్న విషయాన్ని ఏ హిస్టరీ అధ్యాపకుడిని అడిగినా తెలుస్తుంది. కాకపోతే ఎక్కువ పేర్లు పర్షియన్, తక్కువ పేర్లు అరబిక్‌ పదాల నుంచి వచ్చినవి.  ఒక్క ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే 45 శాతం నగరాలు, పట్టణాలకు పర్షియన్‌–అరబిక్‌ పేర్లే. దేశంలో ఒక్క నగరాలు, వీధుల పేర్లే కాదు, మన బంధాలు, అనుబంధాలు, సంబంధాల్లో పర్షియన్‌–అరబిక్‌ పేర్లు చొచ్చుకుపోయాయి. మన ఆర్థిక, సామాజిక లావాదేవీల్లో కాకుండా, మన పాలనా వ్యవహారాల్లో కూడా ఇప్పటికీ పర్షియన్‌ పేర్లనే వాడుతున్నాం. మొత్తంగా మన సంస్కతిలో కలిసిపోయి మన సాహిత్యంలో, మన భాషల్లో కూడా ఈ పేర్లే ప్రతిఫలిస్తున్నాయి. అంతేకాదు, మనం కట్టుకునే గుడ్డల్లో తినే తిండిలో ఈ పేర్లే కలిసి పోయాయి. వీటన్నింటినీ ఎలా మార్చగలం ?

మోదీ వేషధారణలో కూడా పర్షియన్‌ పేర్లే
మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధరించే కుర్తా, పైజామా పర్షియన్‌ పదాలే. ఆయన కళ్లకు  పెట్టుకునే ‘చస్మా’ కూడా పర్షియనే. షల్వార్‌–కమీజ్‌లతోపాటు పెళ్లిల్లో ఉత్తర భారతీయులు ఎక్కువగా ధరించే షేర్వానీ కూడా పర్షియన్‌ పదమే. మోదీ మాట్లాడే భాషలో సగానికిపైగా పర్షియన్‌ పదాలే ఉంటాయి. మాలిక్, మజుందార్, మజ్దూర్‌ పర్షియన్‌ పదాలే, సర్కార్, జిల్లా, తెహసిల్, తాలూకా పర్షియన్‌ పదాలే. మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లో ఆయన ఇంటి పేరు కూడా పర్షియనే. ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌ సరాయ్‌ రైల్వే స్టేషన్‌ పేరును యోగి పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌గా మార్చిన విషయం తెల్సిందే. అందులోని ‘దీన్‌ దయాల్‌’ పర్షియన్‌ పదమే. ప్రపంచంలోకేల్లా ఎల్తైన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఇటీవల మోదీ స్వయంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. సర్దార్‌ పటేల్‌ పేరులోని సర్దార్‌ పదం పర్షియనే. ఇన్ని పేర్లను ఎలా మార్చగలం?

మనం తినే పదార్థాల్లోనూ అవే పేర్లు
తందూర్‌–పులావ్‌ కూడా పర్షియన్‌–ఆరబిక్‌ పేర్లే. హల్వా, జలేబి, సమోసాలతోపాటు కూరల్లో ఉపయోగించే పన్నీర్, ప్యాస్, నమక్‌ పర్షియన్‌–అరబిక్‌ పదాలే. తర్బూజా (పుచ్చకాయ) పర్షియన్‌ పదమే. చాయ్‌వాలా అంటూ మోదీని పిలుస్తారుకాని అందులో చాయ్‌ అచ్చంగా పర్షియన్‌ నుంచి వచ్చిందే. షరాబ్, దారూ పదాలు పర్షియనే. 

సైన్యంలోనూ తిట్టలోనూ అవే పదాలు 
భారత సైన్యంలోని సిపాయి, సుబేదార్, హవల్దార్‌ హోదాలు పర్షియన్‌ పదాలే. కమీనా, హరామీ పదాలు అవే. ఐదు నదులు కలిగిన పంజాబ్‌లో ఆబ్‌ (నది) పర్షియనే. ఫరీదాబాద్, హైదరాబాద్, అహ్మదాబాద్‌ అన్నింటో ఉన్న అబాద్‌ పర్షియన్‌ పదమే. అబాద్‌ అంటే పర్షియన్‌లో జనావాస ప్రాంతం.  అఫ్టల్‌గంజ్‌లో గంజ్, సుల్తాన్‌ బజార్‌లో బజార్‌ పర్షియన్‌ పదాలే. ఉప్పల్‌ కలాన్‌లో కలాన్‌ (పెద్దది), ఖుర్ద్‌ (చిన్నది) పర్షియన్‌ పదాలే. 

గాంధీజీ చరఖా అక్కడిదే. 
జాతిపిత మహాత్మాగాందీ నూలు వడకడానికి ఉపయోగించిన ‘చరఖా’ పర్షియన్‌ నుంచి వచ్చిందే. సుభాస్‌ చంద్ర బోస్‌ ఏర్పాటు చేసిన ‘ఆజాద్‌ హిందూ ఫౌజ్‌’ పర్షియన్‌ మూలం నుంచి వచ్చిందే. భారత రెవెన్యూ భాషలో 90 శాతం పర్షియన్‌ పదాలే. 

నిత్య జీవితంలోనూ అవే పదాలు 
సాబూన్‌ (సబ్బు), దివార్‌ (గోడ), టక్యా (దిండు), పర్దా (తెర) పదాలు కూడా పర్షియన్‌ నుంచి వచ్చినవే. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం అధికార భాషలోకి చొచ్చుకుపోయిన పర్షియన్‌ పదాలను మార్చి ఆ స్థానంలో ఆధునిక హిందీ భాషా పదాలను తీసుకరావాలని ప్రయత్నించింది. అందుకోసం 1955లో ఓ అధికార భాషా కమిషన్‌ను వేసింది. కొన్ని పదాలను ప్రయోగాత్మకంగా మార్చింది. రేడియో (ఎలక్ట్రికల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ డివైస్‌)ను విద్యుత్‌ ప్రసారణ అని, రైలును లోహ్‌ పత్‌ గామిని మార్చింది. వీటిపై కూడా సంస్కృత పదాల ప్రభావం ఉండడాన్ని ప్రముఖ హిందీ కవి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ తన జీవిత చరిత్రలో హేళన చేశారు. భాషా కమిషన్‌ సూచించిన పదాల్లో ఒక్కటి కూడా నేటికి అమల్లోకి రాలేదు.
 

హిందీ, హిందు, హిందుస్థాన్, హిందుత్వ కూడా...
హిందీ, హిందు, హిందుస్థాన్‌ పదాలు కూడా పర్షియన్‌ నుంచి వచ్చినవే. ఇండియన్‌ ఇంగ్లీషు పదం కూడా పర్షియన్‌ మూలమే. హిందు నుంచి వచ్చింది కనుక హిందు పర్షియన్‌ కనుక హిందుత్వ పదం కూడా పర్షియన్‌ మూలం నుంచి వచ్చినట్లే. ఇన్ని పేర్లను మార్చడం ఎవరి తరం కాదు కనుక. హిందూత్వ పేరును ముందుగా మార్చుకోవడం మంచిదేమో!
(గమనిక : జాన్‌ టీ ప్లాట్స్‌ రాసిన ‘ఏ డిక్షనరీ ఆఫ్‌ ఉర్దూ, క్లాసికల్‌ హిందీ అండ్‌ ఇంగ్లీషు, ఫ్రాన్సిస్‌ జోసఫ్‌ స్టింగాస్‌ రాసిన ‘పర్షియన్‌–ఇంగ్లీషు డిక్షరీ’ ఆధారంగా ఈ వార్తా కథనం)

మరిన్ని వార్తలు