ఇద్దరు మహానేతల అస్తమయం;మోదీకి తీరని లోటు!

24 Aug, 2019 15:27 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-1 హయాంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ దాదాపు 20 రోజుల వ్యవధిలో మరణించడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఎన్నికల హామీలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను మోదీ సర్కారు రద్దు చేసిన మరుసటి రోజే చిన్నమ్మ కన్నుమూయగా... జైట్లీ ఈరోజు మధ్యాహ్నం(శనివారం)తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రిగా సుష్మ జాతికి చేసిన సేవలను, ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ దేశ ఆర్థిక వ్యవస్థలో పలు కీలక మార్పులకు సాక్షిగా ఉన్న వైనాన్ని గుర్తు చేసుకుంటూ బీజేపీ నాయకులు ఉద్వేగానికి లోనవుతున్నారు. వీరిద్దరి అస్తమయం పార్టీ పరంగానే గాకుండా వ్యక్తిగతంగా కూడా తమకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ అనారోగ్య కారణాల రీత్యా ఆరు పదుల వయస్సులోనే కన్నుమూయడం వారిని మరింత విషాదంలోకి నెట్టింది.

‘అమ్మ’గా అభిమానం చూరగొన్నారు..
గత ఐదేళ్లలో భారతదేశ దౌత్య సంబంధాలను మెరుగుపరచడంలో విదేశాంగ మంత్రిగా సుష్మ ప్రముఖ పాత్ర పోషించారు. 2014లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ దాదాపు 90 దేశాల్లో పర్యటించారు. వివిధ దేశాలతో సత్సంబంధాలు నెలకొనడంలో ఈ పర్యటనలు ఎంతగానో తోడ్పడ్డాయి. అయితే ఇవన్నీ సజావుగా సాగడానికి సుష‍్మ చతురత, దౌత్యనీతి ముఖ్య కారణాలు అన్న విషయం బహిరంగ రహస్యమే. ఇక 2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించాల్సి వచ్చినపుడు ఆశువుగా ఉపన్యాసం ఇస్తానని మోదీ ప్రకటించగా.. కాగితం మీద రాసుకుని చదివితేనే చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తుందని చిన్నమ్మ చెప్పడంతో మోదీ ఆమె సలహాను పాటించారు. సుష్మ మాట అంటే ఆయనకు అంత నమ్మకం. ఇక విదేశాంగ మంత్రిగా సమస్యల్లో ఉన్న అనేక మంది ప్రవాస భారతీయులకు సుష్మ అండగా నిలిచారు. ఉపాధి కోసం వలసవెళ్లి బందీలైన వారికి ఒకే ఒక ట్వీట్‌తో తక్షణ విముక్తి కల్పించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంతేగాకుండా ఎన్నికలకు ముందు పుల్వామా ఉగ్రదాడి కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి రేగిన సమయంలోనూ సుష్మ కీలకంగా వ్యవహరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయడంలో ఆమె సఫలీకృతులయ్యారు. రష్యాతో పాటు పాక్‌ మిత్రదేశం అయిన చైనాతో కూడా చర్చలు జరిపి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్‌కు మద్దతు కూడగట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

 
   
ఇక విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ కేవలం తన శాఖకే పరిమితమైపోకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నారై బాధిత భార్యల కోసం చక్కటి పరిష్కార విధానాలను రూపొందించారు. ఎన్నారై భర్తలపై స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న భార్యలు చేసే ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిశీలించి, ఆగడాల భర్తలను పట్టుకోవడం కోసం తన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఈ లక్షణాలన్నీ వెరసి దేశ ప్రజలకు ఆమెను ప్రియమైన మంత్రిగా చేయడంతో పాటు ఆపదలో ఆదుకునే సూపర్‌ మామ్‌గా కీర్తిని తెచ్చిపెట్టాయి. అంతేగాక ప్రఖ్యాత ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ఆమెను భారతదేశపు ‘బెస్ట్‌ లవ్డ్‌ పొలిటీషియన్‌’ అని కీర్తించింది. ఇవన్నీ సుష్మ వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు పొందడమేగాక నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనేలా చేశాయి.

ఆయన హయాంలోనే కీలక సంస్కరణలు
వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్‌ జైట్లీ మోదీ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలను కేంద్రం చేపట్టింది. అదే విధంగా అరుణ్ జైట్లీ హయాంలోనే సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు కూడా. కేవలం విత్త మంత్రిగానే గాకుండా ప్రముఖ న్యాయవాదిగా కూడా పేరొందిన జైట్లీ అనేక సందర్భాల్లో మోదీ సర్కారుకు న్యాయ సలహాలు ఇచ్చారు. బీజేపీ ట్రబుల్‌షూటర్‌గా గుర్తింపు పొందిన ఆయన... ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టడంలో దిట్టగా ప్రసిద్ధికెక్కారు. రఫేల్‌ ఒప్పందంపై అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోదీ సర్కారును విమర్శించిన సమయంలోనూ జైట్లీ తనదైన శైలిలో వాటిని తిప్పికొట్టారు. మోదీకి నమ్మిన బంటుగా ప్రాచుర్యం పొందిన జైట్లీ తన విశేషానుభవాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురైన చిక్కుప్రశ్నలను సులువుగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచించారు. ఇక కార్పోరేట్‌ వర్గాల్లో కలకలం రేపిన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచర్‌ తీరుపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసి సంచలనం సృష్టించారు. అంతేగాకుండా మోదీకి అనుకూలంగా సమర్థవంతంగా తన వాదనలు వినిపించేవారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ట్విటర్‌ ద్వారా తన సందేశాలను పోస్ట్‌ చేస్తూ ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇచ్చేవారు. ఈ క్రమంలో ఆయన మరణం మోదీకి తీరని లోటు అని బీజేపీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు