అరాచక కూటమిపై పోరు: జైట్లీ

27 May, 2018 04:03 IST|Sakshi
పట్నాలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

న్యూఢిల్లీ: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ప్రధాని మోదీకి, ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తున్న ‘అరాచక కూటమి’కి మధ్య ఉంటుందని కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న జైట్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్డీయే సర్కారుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ఆసుపత్రి నుంచే ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రాంతీయ పార్టీల కూటమి బీజేపీకి కాల్పనిక ప్రత్యామ్నాయమే తప్ప అసలైన ప్రత్యామ్నాయం కాబోదని జైట్లీ చెప్పారు. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు, ఎన్నో తేడాలు ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైనా.. ఆ కూటమి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్నారు. ‘టీఎంసీ, డీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్‌ తదితర పార్టీలతో కలసి బీజేపీ గతంలో పనిచేసింది. వారు ఓ రోజు ఒక పార్టీకి మద్దతిస్తే మరుసటి రోజు మరో పార్టీకిస్తారు. 1996–98 మధ్య భారత్‌ ఫెడరల్‌ ఫ్రంట్లను చూసింది. అదొక విఫల విధానం’ అని జైట్లీ అన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమనీ, మరికొన్నింటికి రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే ప్రాబల్యం ఉందన్నారు.

కుంభకోణాల్లేని పాలనను అందించాం..
నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తమ ప్రభుత్వ విజయాలను జైట్లీ వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత నాలుగేళ్లలో అవినీతి కుంభకోణాలు లేని పాలనను అందించిందన్నారు. యూపీఏ కాలంలో ప్రపంచంలోనే అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్‌ పరిస్థితి నేడు ఎంతో మెరుగుపడిందన్నారు. శాసన, వ్యవస్థాగత మార్పుల ద్వారా మోదీ పారదర్శక విధానాలను తీసుకొచ్చారనీ, యూపీఏ కాలంలో లాగా కాకుండా ప్రస్తుతం పార్టీకి, దేశానికి ఒకరే నాయకుడు ఉన్నారని జైట్లీ అన్నారు. ప్రస్తుతం దేశం నిరాశ, నిస్పృహల నుంచి ఆశలు, ఆకాంక్షలవైపు వెళ్తోందన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ తదితర చర్యలతో అవినీతిని నిర్మూలించేందుకు, పన్నులు సక్రమంగా వసూలు చేసేందుకు తాము కృషి చేశామని జైట్లీ వివరించారు.

మరిన్ని వార్తలు