అదొక అరాచక కూటమి : జైట్లీ

26 May, 2018 17:52 IST|Sakshi
ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ పక్షాలు అభినందనలు తెలుపుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ విశ్వాస ఘాతుక దినోత్సవం పేరిట దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే కాంగ్రెస్‌, ఇతర పార్టీల తీరుపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న జైట్లీ.. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ వేదికగా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ భారత ప్రజలు తిరస్కరణకు గురికాక తప్పదంటూ జైట్లీ జోస్యం చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత్‌ వంటి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమే. వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన ఈ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొనసాగాలంటే ఆయా పార్టీల మధ్య సఖ్యత అవసరం. అప్పుడే నిజాయితో కూడిన పాలన అందించడానికి వీలవుతుందంటూ పేర్కొన్నారు.

అధికార దాహంతో అరాచక కూటమి ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. ఒక్కసారి వారి (టీఎంసీ, డీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్‌) ట్రాక్‌ రికార్డు చూస్తే వారికున్న నిలకడ ఏమిటో అర్థమవుతుందంటూ ఎద్దేవా చేశారు. అవసరాలకు అనుగుణంగాఎప్పటికప్పుడు సిద్థాంతాలు మార్చుకునే అలాంటి పార్టీలు కూటమి ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా లాభమేమీ ఉండదని జైట్లీ పేర్కొన్నారు. కర్ణాటకలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్‌.. చివరి నిమిషంలో ప్రాంతీయ పార్టీతో కలిసి కూటమి ఏర్పాటు చేసి దిగజారుడుతనానికి పాల్పడిందంటూ ఘాటుగా విమర్శించారు.

మరిన్ని వార్తలు