కార్యకర్తలకు బహిరంగ లేఖ రాసిన కేజ్రీవాల్‌

29 May, 2019 18:46 IST|Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్‌తో పాటు మిగతా ప్రతిపక్షాలన్ని మోదీ దెబ్బకు మట్టి కరిచాయి. ఢిల్లీలో ఆప్‌ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మొత్తం 7 లోక్‌ సభ స్థానాల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. అటు పంజాబ్‌లో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది కేజ్రీవాల్‌ పార్టీ. ఈ క్రమంలో పార్టీ వైఫల్యానికి గల కారణాలను ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. కార్యకర్తలను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో పార్టీ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలను పేర్కొన్నారు.

‘ఈ ఎన్నికల్లో మనం అనుకున్న ఫలితాలను సాధించలేకపోయాం. ఎన్నికల అనంతరం జరిపిన గ్రౌండ్‌ విశ్లేషణలో ఇందుకు గల కారణాలు తెలిసాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ అనుకూలంగా ఏర్పడిన వాతావరణం ఢిల్లీలో కూడా ప్రభావం చూపించింది. మరోటి ఈ ఎన్నికలను ప్రజలు మోదీ, రాహుల గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా భావించారు. ఫలితంగా మనం ఓడిపోయాం. అంతేకాక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు మన పనితనం చూసి మనకు ఓటేశారు. అందువల్లే మనం ఢిల్లీ విధాన సభలో కూర్చోగలిగాము అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా మన పనితీరే మనల్ని కాపాడుతుంద’ని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు