ఇంటింటికీ ముఖ్యమంత్రి

19 Feb, 2019 07:52 IST|Sakshi

ప్రభుత్వ విజయాలు, పనితీరుని వివరిస్తున్న ఢిల్లీ సీఎం

లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌ 

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ కోసం విరాళాలు సేకరించడం కోసం, రానున్న ఎన్నికలలో పార్టీ కోసం ప్రచారం చేయడం కోసం ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ ప్రాంతంలో ఇంటింటికీ తిరిగారు. తమ ప్రభుత్వం చేసిన పనితో ప్రజలు సంతోషంగా ఉన్నారని, వారు ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓట్లు వేస్తారని, విరాళాలు ఇస్తారని కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాతో పాటు ఆప్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు కూడా నగరంలోని వివిధ ప్రాంతాలలో తిరిగి పార్టీ కోసం ప్రచారం జరపడంతో పాటు విరాళాలను ఇవ్వవలసిందిగా ప్రజలను కోరారు.

తన నియోజకవర్గమైన న్యూఢిల్లీలో పలువురితో మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు ఆప్‌ పనికి ఆటంకాలు సృష్టించడం మినహా మరే పని చేయటం లేదని ఆరోపించారు. ఆప్‌ విరాళ సేకరణ కార్యక్రమం–ఆప్‌ కా దాన్, రాష్ట్ర్‌ కా నిర్మాణ్‌ను కేజ్రీవాల్‌ గత సోమవారం మొదలుపెట్టారు. ఈ ప్రచార కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా, విద్యుత్తు బిల్లుల విషయంలో ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పి విరాళాలు కోరవలసిందిగా కార్యకర్తలను ఆప్‌ కోరింది. సీలింగ్‌ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ ఎంపీల వైఫల్యాన్ని కూడా ప్రచారంలో ఎత్తిచూపుతారు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలలో 3,000 మంది ఆప్‌ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పార్టీ కోసం విరాళాలు సేకరిస్తారు.

రానున్న ఎన్నికల కోసం పార్టీకి రూ.100 లేదా రూ.1,000, లేదా రూ.10,000 ఎవరిశక్తి కొద్ది, ఎవరికి తోచినంత వారు నెలనెలా విరాళంగా ఇవ్వాలని ఆప్‌ విజ్ఞప్తి చేస్తోంది. గత మూడు సంత్సరాలుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కానీ పార్టీ కోసం సొమ్ము వెనకేసుకోలేదని, అందువల్ల పార్టీ ఖజానా ఖాళీగానే ఉందని కేజ్రీవాల్‌ చెప్పారు.
 

మరిన్ని వార్తలు