ఉగ్రవాదుల వెన్ను విరిచారా.. ఏమైంది!

19 Jun, 2018 16:21 IST|Sakshi
అరవింద్‌ కేజ్రీవాల్‌ (పాత చిత్రం)

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. అంతా నాశనం చేశాక జమ్మూ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగిందంటూ కేజ్రీవాల్‌ విమర్శించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ బీజేపీని ప్రశ్నించారు. నోట్లరద్దు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కశ్మీర్‌లో ఉగ్రవాదుల వెన్ను విరిచామని చెప్పారని.. కాగా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమైందంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. ఇప్పటికే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివాసంలో గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్‌.. బీజేపీ నిర్ణయాన్ని, వారి విధానాలను తప్పుపట్టారు.

కాగా, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. పీడీపీతో కటీఫ్‌ చెప్పాక.. బీజేపీ కశ్మీర్‌ ఇన్‌ఛార్జ్‌ రాం మాధవ్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. గవర్నర్‌ పాలనతోనే యాంటీ టెర్రర్‌ ఆపరేషన్స్‌ కొనసాగుతాయని రాం మాదవ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు