‘ఆప్‌’ పుట్టుకకు కాంగ్రెసే కారణం

27 Mar, 2019 12:57 IST|Sakshi
ఢిల్లీలోని ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ ఢిల్లీలో సరైన పాలన అందించుంటే ఆమ్‌ ఆద్మీ పార్టీ పుట్టేది కాదన్నారు అరవింద్‌ కేజ్రీవాల్‌. ఢిల్లీలోని రోహిణిలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ‘ఈ పరిస్థితుల్లో షీలా దీక్షిత్‌ ఉన్నా మంచి పాలనే అందించేవారని కొందరు విమర్శిస్తున్నారు. ఆమె ఢిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో విద్య, ఆరోగ్యం లాంటి కీలకాంశాలను నిర్లక్ష్యం చేశారు. మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించలేదు. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో ఆమె ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అందుకే తాను ఆప్‌ లాంటి కొత్త పార్టీని స్థాపించాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ 70 సంత్సరాలు అధికారంలో ఉంది. ఆ పార్టీ మంచి పాలన అందించుంటే మా పార్టీ అసలు ఉనికిలోనే ఉండేది కాద’ని కేజ్రీవాల్‌ అన్నారు. షీలా దీక్షిత్‌ 1998 నుంచి 2003 వరకు జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు గెలిచి అధికారంలో ఉ‍న్న విషయం తెలిసిందే. 

మోదీ సర్కార్‌ను తూర్పారపట్టిన కేజ్రీవాల్‌.. ఢిల్లీలో తాము నూతనంగా స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు నిర్మించాలనుకున్నప్పటికీ, కేంద్రం ప్రతి విషయంలోనూ తమకు అడ్డుపడుతూనే ఉందని, సీసీ కెమెరాల బిగింపునకు సంబంధించిన ఫైల్‌ను గత మూడేళ్లుగా ఆమోదించకుండా మోదీ ప్రభుత్వం మోకాలడ్డేస్తోందని దుమ్మెత్తిపోశారు. ‘మేం ఏ పని చేసినా కేంద్రం అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. అదే దేశంలోని మిగతా రాష్ట్రాల విషయంలో ఇవేవీ అవసరం లేదు. వారికా స్వేచ్ఛ ఉంది. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే అలాంటి (బీజేపీ) పార్టీకి ఓటేస్తే, వచ్చే ఐదేళ్లపాటు మళ్లీ అభివృద్ధిని జరగనివ్వరు. కాబట్టి ఆప్‌కు ఓటేయాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించే అంశాన్ని తన మేనిఫెస్టోలో చేర్చడం లేదని తెలిసింది. కేవలం జాతీయ సమస్యల మీదే తమ ప్రచారం కొనసాగుతుందని, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా అంశాన్ని తాము ఎన్నికల ప్రచారంలో లేవనెత్తబోవడం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ మీడియాకు తెలిపారు. 

మరిన్ని వార్తలు