విజయం సాధించేనా.. ఓటమి తప్పదా..!

21 Dec, 2019 19:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మరో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నూతన సంవత్సరం (2020) స్వాగతం పలుకుతోంది. మరో రెండు నెలల్లో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎత్తుగడలు, వ్యూహాలు రచించేందుకు పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు.  ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై నేతలతో చర్చించారు. గత ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు ఆప్‌ 67 స్థానాలను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ నేతలకు మరోసారి కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. గత ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేసే విధంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గడిచిన ఐదేళ్ల అభివృద్ధి.. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం అనే నినాదంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు.

కాగా 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన రీతిలో విజయాన్ని నమోదు చేసిన ఆప్‌.. ఆ తరువాత రాజకీయంగా దిగజారుతూ వచ్చింది. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్కస్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఒకవైపు కాంగ్రెస్‌తో కయ్యం, బీజేపీతో సిద్ధాంతపరమైన పోరాటంతో ఆప్‌ ఏటూ తేల్చుకోలేని స్థితిలో నిలిచింది. మరోవైపు కీలక నేతలు పార్టీని వీడటం, బయటకు వెళ్లి కేజ్రీవాల్‌పై బహిరంగ విమర్శలకు దిగాటం ఆ పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇక దేశ వ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ ఢిల్లీ పీఠంపై జెండా ఎగరేయాలని కమలనాథులు ఇప్పటి నుంచే ‍ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఏ మేరకు ప్రభావం చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

>
మరిన్ని వార్తలు