మోదీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కేజ్రీవాల్‌

21 Jun, 2019 18:21 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి. ఉదయం రాంచీలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని.. ఢిల్లీ చేరుకున్న మోదీని కేజ్రీవాల్‌ కలిశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీకి కేజ్రీవాల్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ అభివృద్ధితోపాటు, సేవ్‌ వాటర్‌, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాల గురించి ఈ సమావేశంలో నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది.

ఈ భేటీకి సంబంధించిన అంశాలను కేజ్రీవాల్‌ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘వర్షకాలంలో యమునా నది జలాలను నిల్వచేయడం ద్వారా.. అది ఏడాది పాటు ఢిల్లీ వాసుల నీటి అవసరాలను తీరుస్తుంది. దీనికి సహాకారం అందించాల్సిందిగా కేంద్రాని కోరాను. మొహల్లా క్లినిక్, ఢిల్లీ గవర్నమెంట్‌ స్కూల్‌ను సందర్శించాల్సిందిగా మోదీని ఆహ్వానించాను. దేశ రాజధాని అయిన ఢిల్లీని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సాకారం అందిస్తుందని.. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం కలిసి పనిచేయడం ముఖ్యమ’ని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ స్కీమ్‌  ఆయూష్మాన్‌ భారత్‌పై చర్చించామని తెలిపిన కేజ్రీవాల్‌..  తమ ప్రభుత్వం చేపట్టిన ఢిల్లీ హెల్త్‌ స్కీమ్‌ గురించి ప్రధానికి వివరించినట్టు వెల్లడించారు. 

కాగా, చాలా కాలంగా మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విపక్ష నేతలో కేజ్రీవాల్‌ ఒకరు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్రంలోని మోదీ సర్కార్‌ సహకరించడం లేదని కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ నేతలు బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆప్‌ నేతలపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా.. తనను హతమార్చడానికి కూడా బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. అయితే నేడు మోదీతో భేటీ అనంతరం కేజ్రీవాల్‌ స్పందించిన తీరుపై పలువరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీపై ఇంత సానుకూల వైఖరి కనబరచడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి అని ట్విటర్‌లో కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు