చీపురుకూ చెత్త అంటుతోందా !

9 Mar, 2019 18:52 IST|Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : ఉన్నత చదువులు చదవి, ఉన్నత ఉద్యోగాల్లో చేరి, ఆ ఉద్యోగాలను కూడా తణప్రాయంగా త్యదించి, ప్రజా సంక్షేమం కోసం సామాజిక కార్యకర్త అవతారం ఎత్తడమే కాకుండా అవినీతి రహిత భారతాన్ని ఆవిష్కరించాలనే సమున్నత లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్‌ కేజ్రివాల్‌ది సాధారణ నేపథ్యం కాదు. అనన్య సాధ్యం కానిది. అటడ్డుగు జనంలో చైతన్యం తీసుకొచ్చి సమాచార హక్కు అనే ఆయుధాన్ని ఎలా వాడాలో వారికి నేర్పించి ‘మెగసెసే’ అవార్డు అందుకున్న ఘన కీర్తి ఆయనది.

మొదటిసారి మెజారిటీలేక 49 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చినా తదుపరి ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా 67 సీట్లు సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘన చరిత్ర ఆయనది. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ ప్రజా నాయకుడిగా ఎదుగుతున్నారనుకున్న గ్రాఫ్‌ ఆయనది. నియంత్రత్వ పోకడలతో స్వీయ పార్టీలోనే కలహాలు చెలరేగి, మహా మహలు పార్టీనీ వీడిపోగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేక తడబడుతున్న వర్తమానం ఆయనది. అన్ని అధికారాలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడం వల్లనే ఢిల్లీ ప్రజలను అన్ని విధాల ఆదుకోలేకపోతున్నానంటూ కేంద్రంపై కన్నెర్ర చేసి నిరవధిక దీక్ష చేస్తానంటూ నినదించిన ఆయనది భవిష్యత్తు బంగారు బాటేం కాదు. 

విద్యాభ్యాసం
ఆయన హర్యానాలోని బివానిలో 1968, ఆగస్టు 16వ తేదీన జన్నించారు. ఖరగ్‌పూర్‌లోని ఐఐటీ నుంచి 1989లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం టాటా స్టీల్‌ కంపెనీలో ఇంజనీరుగా పనిచేశారు. సివిల్స్‌ రాయలనే సంకల్పంతో ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. సివిల్స్‌ రాసి ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌లో చేరారు. తనతోపాటు ముస్సోరిలోని ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆడ్మినిస్ట్రేషన్‌’లో శిక్షణ పొందిన తన బ్యాచ్‌ అధికారి సునీతను పెళ్లి చేసుకున్నారు. ఆదాయం పన్ను శాఖలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న కేజ్రివాల్‌ 2006లో ఆ పదవికి రాజీనామా చేసి పూర్తి సామాజిక కార్యకర్తగా మారిపోయారు. ఆయన ఆదాయం పన్ను శాఖలో పనిచేస్తున్నప్పుడే 1999లో ‘పరివర్తన్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి సంస్థ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. పేదలకు సరసమైన ధరలకు రేషన్‌ బియ్యం అందించడంతో పాటు సబ్సిడీ ధరలపై విద్యుత్‌ సౌకర్యం కల్పించాలంటూ పోరాటం జరిపారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అందుకు గుర్తింపుగా 2006లో మెగాసెసే అవార్డును అందుకున్నారు. ఆ అవార్డు ద్వారా వచ్చిన డబ్బును కార్పస్‌ ఫండ్‌గా పెట్టి ‘పబ్లిక్‌ కాజ్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. 

అన్నా హజారే ఆధ్వర్యంలో
2012లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అందుకు జన్‌ లోక్‌పాల్‌ బిల్లును తేవాలనే డిమాండ్‌కు ఆమోదం తెలిపారు. ఈ విషయంలోనే ఆయనకు అన్నా హజారేతో విభేదాలు వచ్చాయి. రాజకీయ నేతలు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును తీసుకరావాలన్నది హజారే పంథా కాగా, తామే ప్రభుత్వుంలోకి వస్తే తప్ప అది సాధ్యం కాదన్న అభిప్రాయంతో కేజ్రివాల్‌ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆవిర్భావం
2012 అక్టోబర్‌ రెండవ తేదీన గాంధీ జయంతి రోజున తాను పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రివాల్‌ ప్రకటించారు. 2012 నవంబర్‌ 26వ తేదీన (భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు) ఢిల్లీ వేదికగా ఆమ్‌ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. 2013 డిసెంబర్‌ 4వ తేదీన జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటికీ మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగిన షీలా దీక్షిత్‌పైనే పోటీచేసి గెలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కావాల్సిన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో 2013 డిసెంబర్‌ 23వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జన్‌ లోక్‌పాల్‌ బిల్లు విషయమై కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం, ఇదే బిల్లు ఇష్టం లేక బీజేపీ మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో కేజ్రివాల్‌ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.

అఖండ మెజారిటీతో అధికారంలోకి
2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఢిల్లీ నుంచి కాకుండా యూపీలోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసి కేజ్రివాల్‌ ఓడిపోయారు. ఆ తర్వాత 2015 ఫిబ్రవరి 7వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 67.14 శాతం ఓట్లతో 70 సీట్లకుగాను 67 సీట్లలో తన పార్టీని విజయపథాన నడిపించారు. ఫిబ్రవరి 14వ తేదీన రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పేదలకు అనుకూలంగా రాష్ట్రం విద్యుత్, రేషన్‌ సరకుల రంగాల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. పార్టీ అంతర్గత కలహాల కారణంగా యోగేంద్ర యాదవ్, ప్రశాంత్‌ భూషణ్‌ లాంటి సామాజిక కార్యకర్తలు కూడా పార్టీని వీడిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాంగా ప్రధాని అభ్యర్థిగా ఎదుగుతారనుకున్న ఆయన గ్రాఫ్‌ పడిపోతూ వచ్చింది.

అవార్డులు – రివార్డులు 

  • అరవింద్‌ కేజ్రివాల్‌కు 2004 లో అశోక ఫెల్లో
  • 2005 లో కాన్పూర్‌ ఐఐటీ నుంచి సత్యేంద్ర దూబే స్మారక అవార్డు
  • 2006 లో రామన్‌ మెగసెసె అవార్డు
  • 2006 లో సీఎన్‌ఎన్‌–ఐబీఎన్‌ నుంచి ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు
  • 2009 లో ఖరగ్‌పూర్‌ ఐఐటీ నుంచి ‘డిస్టింగ్‌ష్డ్‌ అలుమ్నుస్‌ అవార్డ్‌’
  • 2009 లో భారతీయ అభివద్ధి సంస్థ ఫెల్లోషిప్‌
  • 2010 లో ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ నుంచి కార్పొరేట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు
  •  2010 లో ఎన్డీటీవీ నుంచి హజారేతోపాటు ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు 

కేజ్రివాల్‌ రాసిన పుస్తకం : స్వరాజ్‌
నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండాలో కేజ్రివాల్‌ ఇందులో వివరించారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సిద్ధించాలంటే ఢిల్లీలోని కొద్ది మంది పెద్దల చేతుల్లో అధికారం కేంద్రీకతమై ఉండరాదని, గ్రామ సభలకు, మొహల్లా సభలకు ఎక్కువ అధికారాలు ఉండాలంటూ ఆయన వాదించారు.

కేజ్రివాల్‌ పైన పుస్తకాలు

  • ది మేన్‌ విత్‌ ఏ విజన్‌–అరవింద్‌ కేజ్రివాల్‌
  • ది జర్ని ఆఫ్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ ఫ్రమ్‌ ఏ స్టూడెంట్‌ టు ది చీఫ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఢిల్లీ
    - వి. నరేందర్‌ రెడ్డి
మరిన్ని వార్తలు